జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకుల్లో తెలంగాణ దూకుడు
ABN , Publish Date - May 27 , 2026 | 05:06 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్‌లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. గతేడాది అచీవర్‌గా నిలిచిన రాష్ట్రం..
గత ఏడాది అచీవర్‌గా.. ఈఏడాది ‘హై పెర్ఫార్మర్ ’గా రికార్డు
రూ.250 కోట్లతో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో ఏర్పాటు
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో లాజిస్టిక్ రంగంపై కోర్సులు
తెలంగాణ సర్కారుకు కేంద్రం ప్రశంస
హైదరాబాద్, మే 26(ఆంధ్ర జ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్‌లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. గతేడాది అచీవర్‌గా నిలిచిన రాష్ట్రం.. ఈ ఏడాది ‘హై పెర్ఫార్మర్ ’గా రికార్డు సాధించడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారును ప్రశంసించింది. హర్యానా, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఉందని తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, లాజిస్టిక్ రంగం అభివృద్ధికి వేగవంతమైన చర్యల వల్లే ఇది సాధ్యమైనట్లు వివరించింది. నదీ మార్గాల్లో జరిగే రవాణాలో రాష్ట్రం జాతీయ సగటు కంటే మెరుగైన పురోగతి నమోదు చేసినట్లు తెలిపింది. కృష్ణానదిపై సరకు రవాణా, పోర్టు అనుసంధానం, ఇంటర్ మోడల్ లింకేజీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. గోదావరి, కృష్ణా, బీమా, మంజీరా, తుంగభద్ర వంటి జాతీయ జలమార్గాలను సరకు రవాణాకు అనుకూలంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్యారడైజ్-శామీర్‌పేట, పారడైజ్-సుచిత్ర ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సైతం కేంద్రం ప్రశంసించిందని తెలిపింది. నల్గొండ జిల్లా చిట్యాలలో రూ.750 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కు ద్వారా సుమారు 2700 మందికి కొలువులు లభిస్తాయంది. మెదక్ జిల్లా పార్కిబండలో 324 ఎకరాల్లో ప్రతిపాదిత మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ కీలకంగా మారనుందని తెలిపింది. ఎగుమతి, దిగుమతులకు ఊతం లభించేలా రూ.250 కోట్లతో నిజామాబాద్‌లో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జహీరాబాద్‌లోని నిమ్జ్‌కి అనుసంధానంగా జాతీయ రహదారి-65 నుంచి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం వల్ల హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు భారీ మేలు జరుగుతుందని వెల్లడించింది. పారిశ్రామిక పార్కుల్లో కనీసం ఐదెకరాల భూమిని లాజిస్టిక్ మౌలిక వసతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడాన్ని కేంద్రం ప్రశంసించిందని పేర్కొంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలోనూ పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్, ఈ కామర్స్ కోర్సులను ప్రారంభించినట్లు వెల్లడించింది. మొదటి ఏడాదిలో 500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపింది.