పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:31 AM
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అత్యంత అనుకూలమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్ ప్రతినిధులతో మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అత్యంత అనుకూలమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ఇటలీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని వారిని కోరారు. తెలంగాణను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇటలీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండేందుకు ‘తెలంగాణ’ సిద్థంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నార్వే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని శ్రీధర్‌బాబు కోరారు. నార్వే పారిశ్రామిక వేత్తలతో కలిసి పని చేసేందుకు తెలంగాణ - నార్వే వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. కాగా, అత్యాధునిక వైద్యపరికరాల తయారీకి తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని నెదర్లాండ్స్ ప్రతినిధులతో శ్రీధర్ బాబు అన్నారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు.