నెలనెలా ఇంధన సర్దుబాటు చార్జీలు
ABN , Publish Date - May 16 , 2026 | 04:38 AM
నియంత్రించడానికి వీల్లేని కారణాలతో ఏ నెలలో అయ్యే వ్యయాన్ని... అదే నెలలో వసూలు చేసుకోవడానికి, లేకుంటే ఏడాది చివర్లో ట్రూ-అప్ ...
వ్యయాన్ని ప్రతి నెలా లేదా ఏడాది చివర్లో వినియోగదారు నుంచి వసూలు చేసుకోవచ్చు
ఈఆర్‌సీ తొలి సవరణ ముసాయిదా
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): నియంత్రించడానికి వీల్లేని కారణాలతో ఏ నెలలో అయ్యే వ్యయాన్ని... అదే నెలలో వసూలు చేసుకోవడానికి, లేకుంటే ఏడాది చివర్లో ట్రూ-అప్ పేరిట క్లెయిమ్ చేసుకోవడానికి డిస్కమ్‌లకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఈఆర్‌సీ (మల్టీ ఇయర్ టారిఫ్) తొలి సవరణ ముసాయిదా నిబంధనలు-2026ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఏ నెలలో అయ్యే వ్యయాన్ని అదే నెలలో వసూలు చేసుకోలేకపోతే మళ్లీ వసూలు చేసుకోవడానికి వీల్లేదు. దాంతో డిస్కమ్‌లు దెబ్బతింటున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో నిబంధనలను సవరించారు. ఇక ఇంధన సర్దుబాటు చార్జీల రూపంలో ప్రతీనెలా వినియోగదారుడి నుంచి యూనిట్‌కు రూ.0.30లకు మించకుండా వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ మళ్లీ అవకాశం ఇవ్వనుంది. తాజా సవరణల్లో ప్రతినెలా లేదా ఏడాది చివర్లో వసూలుకు అవకాశం లభించనుంది. అలాగే, రూ.300 కోట్లు దాటిన పనులు కూడా వాటిలో కీలకం, అత్యవసరమని గుర్తిస్తే... ట్రాన్స్‌కో స్వయంగా చేసుకోవచ్చు. ఇక ఈ ముసాయిదాపై ఈనెల 29 సాయంత్రం 5గంటల్లోపు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉంటే ఇవ్వాలని ఈఆర్‌సీ కోరింది.