Share News

విద్యుత్తు వినియోగం, డిమాండ్‌లో రికార్డుల మోత..12 ఏళ్లలో ఇదే అత్యధికం

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:01 AM

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఒకేరోజు అన్ని రకాల రికార్డులు అధిగమించాయి. ఈనెల 13వ తేదీ ఉదయం 11:17 గంటలకు రాష్ట్ర డిమాండ్‌ 18,228 మెగావాట్లుగా...

విద్యుత్తు వినియోగం, డిమాండ్‌లో రికార్డుల మోత..12 ఏళ్లలో ఇదే అత్యధికం

  • వంట గ్యాస్‌ సంక్షోభంతో ఎలకా్ట్రనిక్‌ స్టౌల వైపు మొగ్గు

  • ఉష్ణతాపంతో పెరిగిన ఏసీలు, కూలర్ల వాడకం

  • రబీలో వ్యవసాయ డిమాండ్‌తో పెరిగిన లోడు

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఒకేరోజు అన్ని రకాల రికార్డులు అధిగమించాయి. ఈనెల 13వ తేదీ ఉదయం 11:17 గంటలకు రాష్ట్ర డిమాండ్‌ 18,228 మెగావాట్లుగా, వినియోగం 341.08 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. గతంలో అత్యధికంగా నమోదైన అన్ని రికార్డులను ఇది అధిగమించింది. గ్యాస్‌ సంక్షోభంతో ఎలకా్ట్రనిక్‌ గృహోపకరణాల వినియోగం గణనీయంగా పెరగడమూ ఇందుకు ఓ కారణం. రబీలో వరి నాట్లు ఊపందుకోవడంతో వ్యవసాయ డిమాండ్‌, ఉష్ణతాపంతో ఏసీలు, కూలర్ల వాడకమూ బాగా పెరిగింది. ఇలా అన్ని కారణాలతో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డులన్నీ దాటేసింది. గత 12ఏళ్ల కాలంలో ఇదే అత్యధిక వినియోగం, డిమాండ్‌ కావడం గమనార్హం. రానున్న రోజుల్లో రోజుకు 350 మిలియన్‌ యూనిట్లకు పైగా అవసరమవ్వచ్చని, లోడ్‌ సైతం 19వేల మెగావాట్లకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్‌ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఏర్పాట్లు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సిబ్బందిని అభినందించారు. ఇక బహిరంగ విపణిలో విద్యుత్‌ కొనుగోళ్లు బలంగా జరుగుతున్నాయి. డే ఎహెడ్‌ మార్కెట్‌(ఒకరోజు ముందు వేలంపాట)లో యూనిట్‌ విద్యుత్‌ రాత్రి 12:15 నుంచి మర్నాడు ఉదయం 7:45 గంటల దాకా రూ.10కి అమ్ముడుపోతుండగా... సౌరవిద్యుత్‌ ఉత్పాదన వేళ క్రమేణా తగ్గుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు యూనిట్‌కు రూ.6.38 ఉండగా.. ఉదయం 8:15కు యూనిట్‌ రూ.4.55గా, ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు యూనిట్‌ రూ.2.1గా ఉంటోంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల దాకా యూనిట్‌ ధర రూ.10కి తగ్గడం లేదు. ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌లో ప్రతి 15 నిమిషాలకు ఒక స్లాటుగా విద్యుత్‌ విక్రయాలు జరుగుతాయి.

Updated Date - Mar 15 , 2026 | 07:02 AM