90శాతం మంది ఆర్టిజన్ల విధుల బహిష్కరణ
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:17 AM
తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు బుధవారం నుంచి సమ్మెబాట పట్టారు. ఖైరతాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్, డివిజన్ కార్యాలయాలు...
రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కోలోని ఆర్టిజన్లు
ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించకపోవడంతో సమ్మె యథాతథం
విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు బుధవారం నుంచి సమ్మెబాట పట్టారు. ఖైరతాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్, డివిజన్ కార్యాలయాలు, సబ్‌స్టేషన్ల వద్ద ఆర్టిజన్లు ఉదయం నుంచి విధులు బహిష్కరించి ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేశారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కోలో పనిచేస్తున్న సుమారు 19వేల మంది ఆర్టిజన్లలో 90శాతం మంది విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గ్రేటర్ పరిధిలో పది సర్కిళ్లతోపాటు స్కాడాలో పనిచేస్తున్న 4800 మందికిపైగా ఆర్టిజన్లలో 90శాతం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల కార్యాలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి కేంద్రాలు, సర్కిల్, డివిజన్ కార్యాలయాల ఎదుట ఆర్టిజన్లు దీక్షలు చేపట్టారు. సబ్‌స్టేషన్లలో ఆర్టిజన్లు విధులకు హాజరుకాకపోవడంతో ప్రత్యామ్నాయంగా లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లకు విద్యుత్ అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులులేకుండా చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం, యాజమాన్యాల నుంచి సాయంత్రం వరకు చర్చలపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, కన్వీనర్లు సాయిలు, చంద్రారెడ్డి, శ్రీధర్‌గౌడ్‌లు ప్రకటించారు. ఆర్టిజన్ల సమస్యలపై ఎన్నిసార్లు యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించినా స్పందనలేకపోవడంతో సమ్మెబాట పట్టినట్లు పేర్కొన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్టిజన్ల సమ్మె మరో రెండు, మూడు రోజులు కొనసాగితే విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలుంటాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే ఎస్మా ప్రయోగిస్తామనడం పట్ల ఆర్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టిజన్లు చెబుతున్నారు. సమ్మె నేపథ్యంలో విద్యుత్ సంస్థల సీఎండీలు ఉన్నతాధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.