ఎలక్ట్రిక్ ఆటోలకు 1.50 లక్షల సబ్సిడీ!
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:21 AM
హైదరాబాద్‌ను పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం-26 కింద ఆర్థిక సాయం
రూ.200 కోట్లు బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదన
క్యూర్‌లో 18,766 ఆటోలకు ప్రయోజనం: మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం--2026’ రూపకల్పనకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా వాటిని కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయడం ద్వారా పట్టణ ప్రజా రవాణాను నెట్-జీరో కర్బన ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం తెలిపారు. ఈ పథకం పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల వెలువడే వాయు, శబ్ధ కాలుష్యాలను, ఆటోడ్రైవర్లకు భారంగా మారిన ఇంధన వ్యయాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. రవాణా శాఖ గణాంకాల ప్రకారం క్యూర్ ప్రాంతంలో ఈ పథకానికి అర్హత కలిగిన 18,766 ఆటో రిక్షాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 11,254 డీజిల్ ఆటోలు కాగా, పెట్రోల్ ఆటోలు 7,512 ఉన్నాయని వివరించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారు ఈ పథకం ద్వారా తన పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను రెండు మార్గాల్లో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాగా మార్చుకోవచ్చని, ప్రభుత్వం నుంచి రూ.1.50 లక్షల దాకా ఆర్థిక సాయం అందుతుందని మంత్రి చెప్పారు. తమ ప్రస్తుత ఆటో రిక్షా ఛాసి్‌సను కొనసాగించాలనుకునే లబ్ధిదారులు ఏఐఎస్-123 ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్‌ను ఉపయోగించుకొని తమ వాహనాన్ని ఈవీగా మార్చుకోవచ్చు. ఈ విధానంలో కిట్ ఖర్చు, ఇన్‌స్టలేషన్, ప్రామాణిక ఫిట్‌మెంట్ ఉపకరణాల ఖర్చుతో కలిపి రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ వ్యయం- ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తుందని పొన్నం తెలిపారు.
కొత్త ఎలక్ట్రిక్ ఆటోతో పూర్తిస్థాయి మార్పు
తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను పూర్తిగా అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొనుగోలు చేయాలనుకునే లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. ఫ్యాక్టరీలో తయారైన, టైప్ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ వీలర్ కొనుగోలుకు రూ.1.50లక్షల స్థిర సబ్సిడీ అందిస్తామని మంత్రి పొన్నం చెప్పారు. ఎంపిక చేసిన మోడల్ తుది ఆన్‌రోడ్ ధర నుంచి సబ్సిడీ మొత్తాన్ని ఎంప్యానెల్ చేసిన డీలర్ ముందుగానే తగ్గించి లబ్ధిదారుకి వాహనాన్ని అందించే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం అమలుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల నుంచి రూ.50కోట్ల చొప్పున మొత్తం రూ.200 కోట్లు సమకూర్చే విధంగా ప్రతిపాదన రూపొందించారని తెలిపారు. క్యూర్ ప్రాంతంలోని వాహన యజమానులందరికీ ఈ పథకం సమానంగా వర్తించనున్నందున, వివిధ సంక్షేమ శాఖల నుంచి నిధులను సమకూర్చేలా ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.