Share News

సొంత స్థలంలోకి గ్రామపెద్దలు వెళ్లనివ్వడం లేదని.. వృద్ధుడి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:53 AM

తన సొంత స్థలాన్ని అమ్ముకోనివ్వకుండా, ఆ స్థలంలో అడుగు కూడా పెట్టనివ్వకుండా గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

సొంత స్థలంలోకి గ్రామపెద్దలు వెళ్లనివ్వడం లేదని..  వృద్ధుడి ఆత్మహత్య

  • మెడకు ఉరి బిగించుకుని వంతెనపై నుంచి దూకి అఘాయిత్యం

  • వేరైన తల, మొండెం.. ఖమ్మం జిల్లాలో ఘటన

ఎర్రుపాలెం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తన సొంత స్థలాన్ని అమ్ముకోనివ్వకుండా, ఆ స్థలంలో అడుగు కూడా పెట్టనివ్వకుండా గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని వంతెనపై నుంచి దూకేశారు. ఈ దెబ్బకు అతని తల, మొండం వేర్వేరు భాగాలుగా తెగి పడ్డాయి. ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడుకు చెందిన యన్నం వెంకటరామిరెడ్డి (70)కి గ్రామ శివారులో 3 గుంటల స్థలం ఉంది. వెంకటరామిరెడ్డి ఏడాది క్రితం ఆ భూమిని వేరే వాళ్లకి విక్రయించారు. అయితే అది గ్రామ రాశి స్థలమని, దానిని అమ్మే, కొనే హక్కు ఎవరికీ లేదని, ఆ భూమిని ఇతరులు స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదంటూ ఆ గ్రామపెద్దలు కొందరు భూవిక్రయానికి అడ్డుపడ్డారు. వెంకటరామిరెడ్డి నుంచి భూమిని కొనుగోలు చేసిన వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు తాము ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ వెంకటరామిరెడ్డిపై ఒత్తిడి పెంచారు. మరోవైపు వెంకటరామిరెడ్డి వైద్య, ఇతర అవసరాల కోసం అప్పటికే ఇతరుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. గ్రామపెద్దల తీరు వల్ల ఓ వైపు అప్పు తీర్చే పరిస్థితి లేక, తన వద్ద భూమిని కొనుగోలు చేసిన వారికి ఆ భూమిని అప్పగించలేక, తన భూమిలో అడుగుపెట్టలేక వెంకటరామిరెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు.


ఈ క్రమంలో తన స్థలాన్ని అమ్ముకోనివ్వకుండా ఏడుగురు గ్రామపెద్దలు అడ్డుకుంటున్నారంటూ ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాసిన వెంకటరామిరెడ్డి అందులో తనని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాశారు. అనంతరం మెడకు తాడు బిగించుకొని కట్టలేరు వంతెన పైనుంచి దూకి వెంకటరామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకుని వంతెన పైనుంచి ఒక్కసారిగా కిందకి దూకడంతో వెంకటరామిరెడ్డి తల, మొండెం భాగాలు వేర్వేరయ్యాయి. వెంకటరామిరెడ్డి ఇద్దరు కుమారులు కొంతకాలం క్రితమే మరణించగా.. ప్రస్తుతం అతని భార్య ఆదెమ్మ ఉంది. ఆదెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 23 , 2026 | 05:55 AM