Share News

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సీజీహెచ్‌ఎస్ రేట్ల వర్తింపు

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:21 AM

‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (ఈహెచ్‌ఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే వైద్య సేవలు, చికిత్సలకు ‘కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం’ (సీజీహెచ్‌ఎస్)రేట్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సీజీహెచ్‌ఎస్ రేట్ల వర్తింపు

  • 15 నుంచి నగదు రహిత చికిత్సలు

  • సీఎం రేవంత్‌ చేతుల మీదుగా హెల్త్‌ కార్డుల పంపిణీ

  • అన్ని వివరాలతో ఈహెచ్‌సీటీ యాప్‌ రూపకల్పన

  • సీఎస్‌తో ఉద్యోగసంఘాల సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (ఈహెచ్‌ఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే వైద్య సేవలు, చికిత్సలకు ‘కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం’ (సీజీహెచ్‌ఎస్)రేట్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు అంగీకరించాయి. ఈహెచ్‌ఎస్‌పై శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ఇతర ఉన్నతాధికారులతో ఉద్యోగులు, పింఛనుదారులు, ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చికిత్సల ధరలు, మార్గదర్శకాల జారీ, హెల్త్‌ కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఉద్యోగుల వైద్య చికిత్సల కోసం సీజీహెచ్‌ఎస్ ప్యాకేజీ రేట్లను వర్తింపజేస్తుందని, రాష్ట్రంలో కూడా వీటినే అమలు చేస్తామని అధికారులు తెలియజేశారు. ఇక్కడి ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రులు అందించే చికిత్సలు, శస్త్ర చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ రేట్లు సరిపోతాయని వివరించారు. దీనికి సంఘాల ప్రతినిధులు అంగీకరించారు. మరోవైపు, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో నూతన హెల్త్‌ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని సీఎస్‌ వెల్లడించారు. ఆ తర్వాత సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఉద్యోగులు హెల్త్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన నగదు రహిత వైద్య సేవలను అందించడానికి హెల్త్‌ కార్డుల విధానం ఉపయోగపడుతుందని సీఎస్‌ పేర్కొన్నారు. పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


943 ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు

ఆరోగ్య పథకానికి సంబంధించిన అన్ని వివరాలతో ఈహెచ్‌సీటీ యాప్‌ను రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. పథకం మార్గదర్శకాలపై నాలుగు రోజుల్లో జీఓ ను జారీ చేయనున్నారు. ఈ నెల 13న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ట్రస్టు సీఈఓ సమావేశం కావాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. అదే రోజు లేదా మరుసటి రోజు జీఓ వెలువడే అవకాశముందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 12 వెల్‌నెస్‌ సెంటర్లకు అదనంగా మరో 24 జిల్లా కేంద్రాల్లో నూతన వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఔట్‌ పేషంట్‌ ట్రీట్‌మెంట్‌, ఆరోగ్య పరీక్షలు, ఔషధాలు వెల్‌నెస్‌ సెంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలోని 943 ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు నగ దు రహిత వైద్య సేవలు అందనున్నాయి. మొత్తం 2,594 చికిత్సలు (ప్రొసీజర్స్‌) కవర్‌ కానున్నాయి. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మారం జగదీశ్వర్‌(టీఎన్‌జీఓ), ఏలూరి శ్రీనివాసరావు (టీజీఓ), దామోదర్‌రెడ్డి (పీఆర్‌టీయూ), చావా రవి (యూటీఎఫ్‌), శ్రీనివాస్ రెడ్డి (సెక్రటరియేట్‌ అసోసియేషన్‌), వంగా రవీందర్‌రెడ్డి (ట్రెసా), సదానంద్‌గౌడ్‌ (ఎస్‌టీయూ), సైదులు (ఎస్‌టీఎఫ్‌), దాస్య నాయక్‌ (క్లాస్‌-4 ఉద్యోగుల సంఘం), పెన్షనర్ల సంఘం ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 06:30 AM