భార్య ఉద్యోగి అయితే డబుల్ ధమాకా
ABN , Publish Date - May 22 , 2026 | 04:12 AM
భార్యాభర్తలు ప్రభుత్వోద్యోగులు అయితే.. ఈహెచ్‌ఎస్(ఉద్యోగుల ఆరోగ్య పథకం) కింద భార్య వేతనం నుంచి చందా చెల్లించడం ద్వారానే గరిష్ఠ ప్రయోజనాలు లభిస్తాయని....
ఆమె జీతం నుంచి చందా చెల్లిస్తే.. ఇరువైపులా తల్లిదండ్రులకు హెల్త్‌స్కీమ్
భర్త చందాతో భార్య వైపు పేరెంట్స్‌కు నో ఛాన్స్
ఈహెచ్‌ఎస్ విధానాలపై ఉద్యోగ సంఘాల స్పష్టత
హైదరాబాద్, మే 21 (ఆంధ్ర జ్యోతి): భార్యాభర్తలు ప్రభుత్వోద్యోగులు అయితే.. ఈహెచ్‌ఎస్(ఉద్యోగుల ఆరోగ్య పథకం) కింద భార్య వేతనం నుంచి చందా చెల్లించడం ద్వారానే గరిష్ఠ ప్రయోజనాలు లభిస్తాయని ప్రభుత్వ ఉద్యోగుల ఐకాసా ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు తెలిపారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారం.. మహిళా ఉద్యోగులకు చట్టంలో ఉన్న ప్రత్యేక మినహాయింపుల వల్ల భార్య జీతం నుంచి చందా వర్తింపచేయడం ద్వారా ఆమెతో పాటు భర్త, పిల్లలు, తల్లిదండ్రులతో సహా అత్తమామలకు (భర్త తల్లిదండ్రులకు) కూడా వైద్య సేవలు అందుతాయని ఐకాస ప్రకటించింది. అదే భర్త జీతం నుంచి చెల్లిస్తే.. భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఆరోగ్య పథకం పట్ల ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఐకాస ఓ ప్రకటన విడుదల చేసింది. భార్య, భర్తల్లో ఎవరో ఒకరు ఈహెచ్‌ఎస్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలని, ఒకరు సర్వీసులో ఉండి మరొకరు రిటై రైనా ఒకరికి మాత్రమే ఆ సౌకర్యం వర్తిస్తుందని చెప్పారు. అన్ని శాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగుల డేటా అప్‌లోడ్ బాధ్యత డీడీవో/ హెచ్‌ఓడీలదేనని ఐకాసా స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉద్యోగుల మూలవేతనం నుంచి 1.5 శాతం చందా రికవరీ చేయనున్నట్లు శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఏఎంసీలు, కేజీబీవీల సిబ్బందికి కూడా మొదటి విడతలోనే ఈహెచ్‌ఎ్‌స వర్తింపజేయాలని ఐకాస ప్రభుత్వాన్ని కోరింది.