ఈహెచ్‌ఎస్‌కు నెట్‌వర్క్ ఆస్పత్రులు నో
ABN , Publish Date - Jul 15 , 2026 | 06:28 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) టారిఫ్‌లపై ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) టారిఫ్‌లతో..
సీజీహెచ్‌ఎస్ రేట్లతో సాధ్యం కాదని వెల్లడి
వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరిక
హైదరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) టారిఫ్‌లపై ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) టారిఫ్‌లతో ఈహెచ్‌ఎస్ అమలు చేస్తే సేవలు నిలిపివేస్తామని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టానా) స్పష్టం చేసింది. టానా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేష్ నాయకత్వంలో ఆస్పత్రుల ప్రతినిధులు ఈహెచ్‌ఎస్ అమలును పర్యవేక్షించే ఈహెచ్‌సీటీ సీఈవో హనుమంతుని కలిశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కొత్త టారిఫ్‌లు.. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ, పాత ఈహెచ్‌ఎస్ కంటే చాలా తక్కువగా ఉన్నాయని, ఇలాగైతే సేవలు అందించడం సాధ్యం కాదని తెలిపారు. పాలక మండలి సహా అన్ని కీలక కమిటీల్లో కనీసం 10 మంది వైద్య నిపుణులకు ప్రాతినిధ్యం కల్పించాలని, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరింది. పాత ఈహెచ్‌ఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. పథకం అమలుకు ముందు నెట్‌వర్క్ ఆస్పత్రులతో సమగ్రంగా చర్చించాలని కోరింది. ఈ అంశాలపై ఆరోగ్యశ్రీ సీఈవోతో చర్చించినా స్పష్టమైన హామీ లభించలేదని పేర్కొంది. కాగా, ఈహెచ్‌ఎస్ ను జూలై 15 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ స్పష్టత రాలేదని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఈహెచ్‌ఎస్ కార్డుల డిజైనే ఇంతవరకు ఖరారు కాలేదని సమాచారం. దీనిపై బుధవారం సీఎంవో అధికారులు సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.