ఉన్నత చదువులు ‘అగ్ర’కులాలవే!
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:27 AM
కనీసం డిగ్రీ (గ్రాడ్యుయేషన్), ఆపై స్థాయి చదువులు పూర్తిచేస్తున్నవారిలో అగ్రకులాల వారే ఎక్కువగా ఉన్నట్టు సర్కారు తెలిపింది. అత్యధికంగా...
కనీసం డిగ్రీ (గ్రాడ్యుయేషన్), ఆపై స్థాయి చదువులు పూర్తిచేస్తున్నవారిలో అగ్రకులాల వారే ఎక్కువగా ఉన్నట్టు సర్కారు తెలిపింది. అత్యధికంగా వైశ్య, వెలమ, బ్రాహ్మణుల్లో 40శాతం వరకు, కమ్మ, రెడ్డి, రాజులు, కాపుల్లో 35శాతానికపైగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు వెల్లడించింది. బీసీ కులాల్లో పద్మశాలి, కంసాలి, పెరిక, మేర, మున్నూరుకాపు, గౌడ కులస్తుల్లో 30శాతం వరకు ఉన్నత చదువులు పూర్తిచేసినట్టు తెలిపింది. ఇక అతి తక్కువగా.. కొలాం (7శాతం), బేడ (8శాతం) గోండు (9శాతం) కులాల వారు గ్రాడ్యుయేషన్ వరకు చదివినట్టు పేర్కొంది. ఒడ్డె, ఖురేజీ ముస్లింలు, మాలి, వాల్మీకి కులస్తుల్లోనూ ఉన్నత చదువుల శాతం తక్కువగా ఉందని వెల్లడించింది. రాష్ట్ర జనాభాలో సగటున 20శాతం మంది ఉన్నత చదువులు చదివినట్టు తెలిపింది.

స్కూల్ డ్రాపౌట్లు ఎస్టీల్లో ఎక్కువ..
ఇక పాఠశాల స్థాయిలో చదువు మానేస్తున్నవారిలో బ్రాహ్మణులు, అయ్యంగార్లు, బీసీ-సీ క్రిస్టియన్లు, జైనులు, కాపు, రాజులు, లంబాడీలు అతి తక్కువగా రెండుశాతం లోపే ఉండగా.. అత్యధికంగా కొలాం, గోండు, కోయ, మాలి, బేడ, ఆరె, వడ్రంగి కులాల వారిలో స్కూల్ డ్రాపౌట్ శాతం ఎక్కువగా ఉందని సర్కారు తెలిపింది.
40 శాతానికిపైగా రెడ్లు చదువు ప్రభుత్వ స్కూళ్లలోనే!
రాష్ట్రంలోని రెడ్డి కులస్తుల్లో 40శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నట్టు సర్కారు నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మహార్, వడ్రంగి, కమ్మరి, మేర, కోయ, కంసాలి కులస్తుల్లో 55 శాతం వరకు.. నాయీ బ్రహ్మణ, పెరిక, బేడ, మున్నూరుకాపు, ఉప్పర, కుమ్మరి, మేదరి, ముదిరాజ్ కులాల వారు 50శాతం వరకు సర్కారీ బడుల్లోనే చదువుతున్నట్టు తెలిపింది. అతి తక్కువగా జైనులు, బ్రాహ్మణులు, కాపు, అయ్యంగార్లలో 15శాతం లోపే.. వైశ్యులు 30శాతం లోపు, కమ్మ, వెలమ కులస్తులు 35శాతంలోపు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు.
కూలీ పనుల్లో ఎవరెక్కడ?
కులాల వారీగా రోజు కూలీలుగా పనిచేస్తున్నవారిని పరిశీలిస్తే.. ఒడ్డెలు అత్యధికంగా 55శాతం.. కొలాం, బేడ, మాదిగ, కోయ, గోండ్ తదితర కులాల వారిలో 50శాతానిపైగా రోజుకూలీగా పనిచేస్తున్నారు. అతి తక్కువగా బ్రాహ్మణుల్లో 2.6 శాతమే రోజు కూలీలు. రాజులు, వైశ్యులు, జైనులు, అయ్యంగార్లు, కాపులు, కమ్మ తదితర కులాల్లో 10-15 శాతం లోపే రోజు కూలీలుగా పనిచేస్తున్నారు.
అత్యధికంగా కొలాం గిరిజనుల్లో 50శాతం, కోయ 45శాతం వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక మాలి, గోండు, మాల, వాల్మీకి, మాదిగ, బేడ, మహార్, లంబాడీ కులాల వారిలో 30శాతానికిపైగా వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. బ్రాహ్మణ, వైశ్య, కాపు, కంసాలి కులాల్లో వ్యవసాయ కార్మికుల శాతం అతి తక్కువగా ఉంది. రాష్ట్రంలో సగటున 19.4శాతం జనాభా వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు.