బంద్ విజయవంతం
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:32 AM
ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా..
హైదరాబాద్‌లో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల మూత
పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాల్లోనూ తెరుచుకోని బడులు, కళాశాలలు
బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నం..
కరీంనగర్‌లో విద్యార్థి సంఘాల నేతల అరెస్టులు
హైదరాబాద్ సిటీ, భగత్‌నగర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. హైదరాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు బంద్ పాటించగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు మాత్రం కొనసాగాయి. హైదరాబాద్‌లోని ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కూడా బంద్ పాటించాయి. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం రాత్రి శాంతి ర్యాలీ నిర్వ హించారు. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తా నుంచి హైదర్‌గూడ ఎమ్మెల్వే క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సీజేపీ ఆందోళనకు టీజేఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అలాగే, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, సిరిసిల్ల జిల్లాల్లోనూ విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని హైదరాబాద్, జనగాం జిల్లా రఘునాథపల్లిలో జరిగిన కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా జూలై 27న కలెక్టర్ కార్యాలయాలు, గవర్నర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని యాద్రాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. హనుమకొండలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి.
బండి సంజయ్ ఆఫీసు ముట్టడికి యత్నం
బంద్ నేపథ్యంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) సభ్యులు కరీంనగర్‌లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని ముందుగానే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ ఎస్‌ఎఫ్ఐ కార్యాలయంలో విద్యార్థి నాయకులను, బాలికల జూనియర్ కళాశాలలో బంద్ నిర్వహిస్తున్న డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.