Share News

బడ్జెట్‌లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:46 AM

విద్యావ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే సామాన్య, పేదవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రముఖ విద్యావేత్తలు స్పష్టం చేశారు.

బడ్జెట్‌లో విద్యకు 20శాతం నిధులు కేటాయించాలి

  • విద్యావ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి

  • అప్పుడే పేదవర్గాలకు నాణ్యమైన విద్య అందుతుంది

  • ఇందిరాపార్కు వద్ద విద్యా పరిరక్షణ కమిటీ మహాధర్నా

కవాడిగూడ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే సామాన్య, పేదవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రముఖ విద్యావేత్తలు స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో కనీసం 20శాతం నిధులు కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టారు. ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, సమాచార హక్కు మాజీ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21-ఏ ప్రకారం ఉచిత, నిర్బంధ విద్య ప్రతి విద్యార్థి ప్రాథమిక హక్కు అని, కానీ ప్రభుత్వాలు విద్యను అంగట్లో సరుకుగా మార్చి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. ఎన్‌టీఏ వంటి సంస్థల వైఫల్యం వల్ల నీట్‌ పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ, విద్యా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే పేద, మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, బడ్జెట్‌లో విద్యకు 20 శాతం నిధులు సాధించే వరకు విద్యాపరిరక్షణ కమిటీ చేసే పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యా హక్కు చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైయ్యాయని ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ విమర్శించారు. సామాన్యులకు చదువును దూరం చేసే కార్పొరేట్‌ అనుకూల విధానాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ చక్రధర్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 06 , 2026 | 04:46 AM