అకాల వర్షం.. ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:45 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాజన్నసిరిసిల్ల, కుమరం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ....
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంట నష్టం
నేలకొరిగిన వరి, మొక్కజొన్న
నిజామాబాద్ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టమని అంచనా
సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాజన్నసిరిసిల్ల, కుమరం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈ ప్రభావంతో ఆయా జిల్లాల్లోని పలు గ్రామాల్లో పంటనష్టం సంభవించింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న పైరు నేలకొరిగింది. ఈదురుగాలుల దెబ్బకు కొన్ని చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ తీగలు తెగి పడి పశువులు మరణించాయి. పిడుగుపాటు వల్ల గోడలు కూలాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో శనివారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో వృక్షాలు నేలకూలగా విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. వీర్నపల్లిలో ఓ గోడ కూలి ఇంటి పక్కన నిలిపి ఉంచిన ఆటో, కారుపై శిథిలాలు పడ్డాయి. వేములవాడలో పిడుగుపాటు వల్ల ఉల్లెందుల రఘుపతి అనే రైతుకు చెందిన రెండు పాడి గేదెలు మృతిచెందాయి. కోనరావుపేట మండలం మరిమడ్లలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వాన దెబ్బకు సుమారు 90 శాతం వరి పంట నేలరాలింది. జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో బెజ్జూరు మండలంలోని అందులగూడ, కుంటలమానేపల్లి, ఊట్పల్లి గ్రామాల్లో పలు ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. పోతేపల్లికి చెందిన డోకే సంజీవ్ అనే వ్యక్తి పిడుగుపాటుకు అస్వస్థతకు గురయ్యాడు.
కెరమెరి మండలంలోని పిప్రి గ్రామంలో ఈదురుగాలుల తీవ్రతకు ఇంటిపై వేసిన రేకులు లేచిపోయాయి. మరోపక్క, కామారెడ్డి జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున వడగండ్ల వర్షం కురిసింది. దీంతో కామారెడ్డి, సదాశివనగర్, బీబీపేట, రాజంపేట, భిక్కనూరు తదితర మండలాల్లో పలుచోట్ల వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. తాడ్వాయి మండలంలోని దేవాయిపల్లి, కరడ్‌పల్లిలో మొక్కజొన్న పంట నేలకొరిగింది. దోమకొండ మండలంలోని సీతారాంపల్లిలో పిడుగుపడడంతో పంట చేనులో ఉన్న గేదె మృతి చెందింది. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన కురవడం వల్ల వరి పంట నేలకొరిగింది. వరితోపాటు మొక్కజొన్న, మామిడి పంటలు కూడా దెబ్బ తిన్నాయి. ఈ మూడు మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నిజామాబాద్ రూరల్ మండలం మాధవనగర్‌లో ఈదురుగాలుల వల్ల విద్యుత్ తీగలు తెగి గేదెలపై పడడంతో ఐదు గేదెలు మృతి చెందాయి.
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 3రోజుల పాటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో అత్యధికంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించింది.