Share News

మొక్కజొన్న ఈ-వేలంతో..ఖజానాకు రూ.202.56 కోట్ల ఆదా

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:31 AM

రైతులకు ప్రయోజనం కలిగిస్తూనే, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు మరోసారి మంచి...

మొక్కజొన్న ఈ-వేలంతో..ఖజానాకు రూ.202.56 కోట్ల ఆదా

  • ప్రజాప్రభుత్వ సంస్కరణలు ఫలితమిస్తున్నాయి

  • కొత్త విధానంతో మొక్కజొన్నకు ఎక్కువ ధర: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రైతులకు ప్రయోజనం కలిగిస్తూనే, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు మరోసారి మంచి ఫలితాలను ఇచ్చాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్రం కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో గత వానాకాలం సీజన్‌లో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ద్వారా 78,916 మంది రైతుల నుంచి 3,80,187 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని వివరించారు. ఈ నిల్వలను కొత్తగా ఈ-వేలం విధానంలో విక్రయించామని, దానితో రాష్ట్ర ఖజానాకు రూ.202.56 కోట్లు ఆదా అయిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత పదేళ్లు మార్క్‌ఫెడ్‌లో మొక్కజొన్న విక్రయాల కోసం గోదాముల వారీగా ఈ-టెండర్లు నిర్వహించారని గుర్తుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అదే తరహాలో నిర్వహిస్తే టన్నుకు సగటున రూ.14,355 ధర మాత్రమే వ్యాపారులు కోట్‌ చేశారన్నారు. ఆ టెండర్లను రద్దు చేసి, పరిస్థితిని సమీక్షించి, సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు.. కొత్తగా ఈ-వేలం విధానాన్ని అమలు చేశామని తెలిపారు. ఈ-వేలంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వ్యాపారులు పాల్గొనడంతో టన్నుకు సగటున రూ.19,337 ధర లభించిందని.. ఇది గత టెండర్లలో వచ్చిన ధరతో పోలిేస్త టన్నుకు రూ.5,327 అధికమని వెల్లడించారు. నిజానికి మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలన్నీ కలిపి టన్నుకు రూ.29,272 వ్యయం అయిందని, ఈ క్రమంలో సుమారు రూ.400 కోట్ల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడమే దీనికి కారణమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టాలను లెక్కచేయకుండా రైతులకు అండగా నిలుస్తోందన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 05:31 AM