డ్రగ్స్, నాటుసారాపై ముప్పేట దాడి
ABN , Publish Date - May 28 , 2026 | 03:24 AM
రాష్ట్రంలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్, నాటుసారా మహమ్మారిని మూలాలతో సహా పాతరేయడమే లక్ష్యంగా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ముప్పేట దాడులతో....
రంగంలోకి ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ బలగాలు
20 రోజుల్లోనే 1,218 నాటుసారా కేసులు.. భారీగా బెల్లం పానకం ధ్వంసం
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి, సింథటిక్ డ్రగ్స్, నాటుసారా మహమ్మారిని మూలాలతో సహా పాతరేయడమే లక్ష్యంగా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు ముప్పేట దాడులతో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్సైజ్‌శాఖ, ఎస్టీఎఫ్, డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలతో పాటు డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) సంయుక్తంగా రంగంలోకి దిగడంతో క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎక్సై జ్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు.. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందాలు నిరంతరం సమీక్షలు జరుపుతూ దాడుల్లో వేగాన్ని పెంచాయి.
మారుమూల తండాల్లో నాటుసారా బట్టీల ధ్వంసం..
రాష్ట్రంలో నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణాను పూర్తిగా అరికట్టడమే ధ్యేయంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు, తండాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యాపారంపై ఎస్టీఎఫ్ బృందాలు విరుచుకు పడుతున్నాయి. గత 20 రోజుల్లోనే నాటుసారా విక్రయదారులపై ఏకంగా 1,218 కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 4,643 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 69,220 లీటర్ల బెల్లం పానకాన్ని అధికారులు ధ్వంసం చేశారు. మరో 45,994 కిలోల నల్లబెల్లాన్ని జప్తు చేశారు. మరోవైపు, సింథటిక్ డ్రగ్స్, మత్తు ఇంజక్షన్లు, కల్తీ కల్లు తయారీకి వాడే ఆల్ఫో జోలం, పెయింటనిల్, మేఫెడ్రోన్ వంటి ప్రమాదకర రసాయనాల అక్రమ చెలామణీపై అధికారులు ఉమ్మడి దాడులకు తెరలేపారు. డీసీఏకు చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్టీఎఫ్ అధికారులు సంయుక్తంగా పలు ఫార్మా, కెమికల్ కంపెనీలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 15 కంపెనీల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టడంతో మత్తుమందుల దందా చేసే వ్యాపారుల్లో గుబులు మొదలైంది. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిఽధిలోని బార్లలో నిబంధనలు ఉల్లంఘనలపై ఎస్టీఎఫ్ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. మే 12 నుంచి సాగిన ఆకస్మిక దాడుల్లో 47 బార్లలో ఆకస్మిక తనిఖీలు జరిపి, నిబంధనలు అతిక్రమించిన బార్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు నివేదికలు సమర్పించాయి.
సరిహద్దుల్లో నిఘా.. భారీగా ఎన్‌డీపీఎల్, గంజాయి సీజ్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యంపై అధికారులు సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉంచారు. ఢిల్లీ, గోవా, హరియాణ వంటి ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 55 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డిఫెన్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో రవా ణా అవుతున్న 244 కిలోల గంజాయితో పాటు యువత జీవితాలను గుల్ల చేస్తున్న ఎండీఎంఏ, ఇతర ప్రమాదకర డ్రగ్స్‌ను పట్టుకుని నిందితులను కటకటాల్లోకి నెట్టారు.