Share News

కరవు కోరల్లోకి..

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:46 AM

సాగుకు అత్యంత కీలకమైన జూన్‌, జులై నెలల్లో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది! రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలాశయాల్లో తాగునీటికి తప్ప సాగుకు చుక్క నీరు లేదు! చెరువులు, కుంటలు కూడా వెలవెలబోతున్నాయి!

కరవు కోరల్లోకి..

  • రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎల్‌నినో

  • ఇప్పటికే 33 శాతం లోటు వర్షపాతం నమోదు

  • ఈ సీజన్లో 40 శాతం లోటు ఉండొచ్చని అంచనా

  • వెలవెలబోతున్న ప్రాజెక్టులు, ఉన్న నీళ్లు తాగునీటికే..

  • గత ఎల్‌నినోల కంటే తీవ్రంగా ఈసారి పరిస్థితులు

  • తొందరపడి సాగు చేస్తే నష్టమంటున్న నిపుణులు

  • బోరు బావుల కింద సాగు చేసినా వరికి కష్టమే

  • ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సాగుకు అత్యంత కీలకమైన జూన్‌, జూలై నెలల్లో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది! రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలాశయాల్లో తాగునీటికి తప్ప సాగుకు చుక్క నీరు లేదు! చెరువులు, కుంటలు కూడా వెలవెలబోతున్నాయి! ఇదే పరిస్థితి కొనసాగితే.. తాగునీటికీ కటకట తప్పదా అనే పరిస్థితి! భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి! రాబోయే మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు! వెరసి, ఎల్‌నినో రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాభావ పరిస్థితులు కాస్తా.. కరవు వైపు అడుగులు వేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 33 శాతం లోటు వర్షపాతం నమోదైందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. 2002లో వచ్చిన ఎల్‌నినోతో పోలిస్తే.. ఈసారి (2026) ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవేళ బోరు, బావుల కింద రైతులు సాగు మొదలుపెట్టినా.. చివరికి పంటలు గట్టెక్కుతాయనే నమ్మకం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలు అప్రమత్తం కావాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ఎంచుకోవటమే మేలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎల్‌నినో దెబ్బకు నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 నాటికి రాష్ట్రంలో 740 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాలి. ఇందులో జూన్‌లో 130.3 మి.మీ, జూలై నెలలో 227.4 మి.మీ. వర్షపాతం పడాలి. కానీ, జూన్‌లో 115 మి.మీ., జూలైలో ఇప్పటి వరకూ కేవలం 43.4 మి.మీ. వర్షపాతమే నమోదైంది. విత్తనాలు వేసి, పంటల సాగు మొదలుపెట్టే కీలకమైన ఈ ఒకటిన్నర నెలల కాలంలో కేవలం 158.4 మి.మీ. వర్షపాతం నమోదు కావటం, 33 శాతం లోటు వర్షపాతం ఏర్పడటంతో రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వారంలో 58.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా.. కేవలం 3.5 మి.మీ. వర్షమే పడింది. జిల్లాలవారీగా చూస్తే... ములుగు, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. అయినా, ఇది పంటల సాగుకు ఏమాత్రం సరిపోదు. మిగిలిన 29 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. హనుమకొండ జిల్లాలో అయితే ఇప్పటికే కరవును తలపించే వాతావరణం నెలకొంది.


జలాశయాలు వెలవెల

రాష్ట్రవ్యాప్తంగా 28,678 చెరువులున్నాయి. 107 రిజర్వాయర్లున్నాయి. రాష్ట్రంలో ఉన్న కోటిన్నర ఎకరాల్లో సుమారు 78 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం భారీ జలాశయాలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల కింద ఉంది. వర్షాలు పడకపోవటం, ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవటంతో.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో ఉన్న జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. సింగూరులో కేవలం 4.53 టీఎంసీలు; నిజాంసాగర్‌లో 6.54 టీఎంసీలు ఉన్నాయి. సింగూరు నుంచి దిగువన ఉన్న నిజాంసాగర్‌కు నీటిని వదిలే పరిస్థితి లేదు. జంటనగరాల తాగునీటి అవసరాలకే ఈ నీటిని నిల్వ చేయనున్నారు. శ్రీరాంసాగర్‌లో కేవలం 15 టీఎంసీలు, మిడ్‌మానేరులో 7.44 టీఎంసీలు; ఎల్‌ఎండీలో 5.60 టీఎంసీలు, కడెంలో 0.46 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 7.85 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్‌లో 137.86 టీఎంసీలు, శ్రీశైలంలో 41.89 టీఎంసీలు ఉన్నా.. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేదు. ఉన్న నీటిని సాగు నీటికి వదిలే పరిస్థితి లేదు. తాగునీటి గండం నుంచి గట్టెక్కితే చాలనే అభిప్రాయం ఉంది. ఆగస్టు వరకు కూడా వర్షాలు పడే పరిస్థితులు కనిపించటం లేదని, నీటిపారుదల ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు మరింత తగ్గిపోయే అవకాశాలున్నాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.


అయినా.. పత్తి, వరికే ఓటు

ఈ ఖరీ్‌ఫలో ఇప్పటి వరకు సుమారు 60 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. నిరుడు ఇదే సమయానికి 61 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే.. ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నా, 33 శాతం లోటు వర్షపాతం నమోదైనా, 29 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోయినా అదే స్థాయిలో పంటలను సాగు చేశారు. సాగు విషయంలో రైతులు తగ్గకపోవటం, గత ఏడాదితో సమానంగా పంటలు సాగు చేయటం ఆందోళనకరంగా మారింది. పత్తి సాధారణ విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలుంటే.. 41.12 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. మొత్తంగా 86.72 శాతం పత్తి సాగు చేయటం గమనార్హం. భూమిలో ఎండా కాలం వేడి తగ్గకముందే పత్తి సాగు మొదలుపెట్టారు. మొక్కజొన్న 59 శాతం సాగు చేశారు. బోరు, బావులు ఉన్న రైతులు వరి నాట్లు కూడా వేశారు. ఇప్పటికే 6.40 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 10 శాతం వరి సాగైనా.. పంట చేతికి వచ్చేదాకా సాగునీరు సరిపోయే పరిస్థితులు లేవు. ప్రస్తుతం ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాల్లో ఉన్న నీటి వనరులు ఖరీఫ్‌ వరి సాగు గట్టెక్కటానికి ఏమాత్రం సరిపోవు.


వచ్చే 3 నెలల్లోనూ తక్కువ వర్షపాతమే: స్టెల్లా, హైదరాబాద్‌ ఐఎండీ డైరెక్టర్‌

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధారణంకంటే 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు నెలల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. దీంతో భూగర్భ జలాలు పడిపోతాయి. నీటి లభ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు సాగుచేయొద్దు. తక్కువ నీరు, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే పంటలు సాగు చేయాలి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనలను గమనించాలి.


ప్రత్యామ్నాయ పంటలే ముఖ్యం

ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, వరి, పత్తి వంటి ప్రధాన పంటలు సాగు చేయకపోవటమే మేలని, తొందరపడి సాగు చేస్తే తీరని నష్టం కలుగుతుందని, విత్తనాలు, కూలీలు, పెట్టుబడి ఖర్చులు కూడా కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో దెబ్బ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే మంచిదని స్పష్టం చేస్తున్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగు రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయిందని, బోర్లు, బావుల్లో కాస్త నీటి నిల్వలు ఉంటే.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి పోవద్దని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ పప్పు ధాన్యాలు కేవలం 4.11 లక్షల ఎకరాలు, నూనెగింజలు 3.40 లక్షలు ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. జొన్నల విస్తీర్ణం కేవలం 16,835 ఎకరాలుంది. రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, సజ్జల విస్తీర్ణం 200 ఎకరాలకు మించలేదు.


40 శాతం తగ్గిపోనున్న వర్షపాతం

పసిఫిక్‌ మహా సముద్రం ఉపరితలంపై ఏర్పడిన వేడిగాలులు నైరుతి రుతుపవనాలను అడ్డుకోవటంతో ఎల్‌నినో ఏర్పడిన విషయం తెలిసిందే. 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగటం, సముద్రం వేడెక్కటంతో వేడిగాలులు పెద్దఎత్తున వీస్తున్నాయి. ఈసారి ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతంతో పోలిస్తే.. 40 శాతం వర్షపాతం తగ్గిపోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకరంగా మారింది. నిజానికి, 2002లో ఎల్‌నినో ఏర్పడినప్పుడు సాధారణంతో పోలిస్తే 25-30 శాతం వర్షపాతం తగ్గింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2009 ఎల్‌నినో ప్రభావంతో 20-25 శాతం వర్షపాతం తగ్గింది. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది. 2015లో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో 15-20 శాతం వర్షపాతం తగ్గింది. కానీ, ఇప్పుడు వర్షపాతం ఇంకా తగ్గుతుందని, 40 శాతం లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. గతంలో ఏర్పడిన ఎల్‌నినోలు అన్నింటికి మించి ఈసారి ఎక్కువ ముప్పు పొంచి ఉందని, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 06:47 AM