ఏ గుర్తు దేనికో...!
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:41 AM
స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం వస్తే చాలు.. రోడ్లపై రయ్‌మంటూ వాహనాలను దుంకించేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా.. ఇంకేం భయమంటూ అడ్డదిడ్డంగా వాహనాలను నడిపించేవారు చాలామంది కనిపిస్తారు
రోడ్లపై సూచిక బోర్డులున్నా.. వాహనదారులు పట్టించుకోరు
డ్రైవింగ్ స్కూళ్లలోనూ సరిగా చెప్పరు
తరగతి గదులు లేకుండానే నిర్వహణ
నిబంధనలకు తిలోదకాలు..పైరవీలతో లైసెన్స్
డ్రైవింగ్ స్కూళ్లపై కొరవడ్డ రవాణా శాఖ నిఘా
టెస్ట్ ట్రాక్‌ల నిర్వహణలోనూ లోపాలు
ఇటీవల ఏసీబీ తనిఖీల్లో బహిర్గతం
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేయడం వస్తే చాలు.. రోడ్లపై రయ్‌మంటూ వాహనాలను దుంకించేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా.. ఇంకేం భయమంటూ అడ్డదిడ్డంగా వాహనాలను నడిపించేవారు చాలామంది కనిపిస్తారు. అసలు వాహనాలను ఎలా నడపాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటివేమీ పట్టించుకోరు. పల్లెలు, పట్టణాలు, నగరాలు ఇలా ఎక్కడ చూసినా.. ఎక్కువ వరకు వాహనదారులు నిబంధనలు ఏమాత్రం పాటించడంలేదు. వాహన వేగం, రోడ్డు తీరు, నో ఓవర్‌టేకింగ్, సింగిల్ లైన్, రోడ్డు మలుపు, రోడ్డుపై పనిజరుగుతుందనే అంశాలకు సంబంధించినవేకాదు ఇతర కీలకమైన జాగ్రత్తలకు సంబంధించి రోడ్లపై సూచిక బోర్డులు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా వాహనాల్లో వెళ్తుంటారు. సూచిక బోర్డుల్లో ఉన్న సిగ్నల్స్‌కు సంబంధించి కనీస అవగాహన లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే ప్రమాదాలకు కారణమవుతాం. రవాణా శాఖ అధికారులు తాజాగా వెల్లడించిన నివేదికల ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో దేశంలో తెలంగాణ ఏడో స్థానంలో, మరణాల్లో తొమ్మిదో స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ప్రమాదాలకు పలు అంశాలతోపాటు రాష్ట్రంలో డ్రైవింగ్ శిక్షణ వ్యవస్థ గాడి తప్పడము కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవింగ్ స్కూళ్లలో అభ్యర్థులకు పూర్తిస్థాయి శిక్షణ అందించాల్సి ఉన్నప్పటికీ.. చాలా వరకు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లు కనీస వసతులు కూడా లేకుండానే కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవింగ్ నేర్చుకునే అభ్యర్థులకు అవగాహన కల్పించాలి. సూచిక బోర్డుల గురించి సవివరంగా చెప్పాలి. ఇందుకు ప్రత్యేక తరగతి గది, తగిన బోధనా సామగ్రి, శిక్షణ వాతావరణం అవసరం. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని డ్రైవింగ్ స్కూళ్లలో ఈ ప్రమాణాలకు తగ్గ వసతులు ఏమాత్రం ఉండటంలేదు. నామమాత్రపు ప్రాక్టికల్ శిక్షణతోనే కోర్సును ముగిస్తున్నారు. డ్రైవింగ్ నేర్పేందుకు ప్రాంతాన్ని బట్టి రూ.3500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతా తామే మేనేజ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా డ్రైవింగ్ లైసెన్సు ఇప్పించాలంటే ఇందుకు రెండింతలు వసూలు చేస్తున్నారు.
టెస్ట్ ట్రాక్‌ల పరిస్థితీ అంతంతే..
డ్రైవింగ్ స్కూళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. లైసెన్స్ కోసం అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించే రవాణా శాఖ టెస్ట్ ట్రాక్‌ల పరిస్థితి కూడా అనేక చోట్ల ప్రశ్నార్థకంగా మారింది. వాహన నియంత్రణ, మలుపులు, రివర్స్, పార్కింగ్, ఎత్తుపల్లాలు, రహదారి సంకేతాల అవగాహన తదితర అంశాలను సమర్థంగా పరీక్షించేలా ట్రాక్‌లను రూపొందించాలి. కానీ కొన్ని టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహణ, మార్కింగ్‌లు, రహదారి ఉపరితలం, అవసరమైన మౌలిక సదుపాయాల విషయంలో లోపాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు లోపాలు బయటపడ్డాయి. డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించే ప్రదేశం రవాణా శాఖ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. డ్రైవింగ్ ట్రాక్‌లో అవసరమైన సూచిక బోర్డులు సైతం లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇదొక్కటే కాదు పలు ఆర్టీఏ కార్యాలయాలకు సంబంధించిన డ్రైవింగ్ ట్రాక్‌లు నిబంధనలకు లోబడి లేవని తెలిసింది.