Share News

గ్లోబల్‌ కంపెనీలను ఆకర్షిస్తున్న తెలంగాణ

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:19 AM

రాష్ట్రంలోని విభిన్న రంగాల్లో నిపుణులతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నందునే అనేక సంస్థలు వారి నూతన కేంద్రాల ఏర్పాటు, తదుపరి విస్తరణల కోసం హైదరాబాద్‌కు...

గ్లోబల్‌ కంపెనీలను ఆకర్షిస్తున్న తెలంగాణ

  • నైపుణ్య మానవ వనరుల కేంద్రం హైదరాబాద్‌

  • టీ-మొబైల్‌ యూఎస్‌ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విభిన్న రంగాల్లో నిపుణులతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నందునే అనేక సంస్థలు వారి నూతన కేంద్రాల ఏర్పాటు, తదుపరి విస్తరణల కోసం హైదరాబాద్‌కు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. సెమీ కండక్టర్స్‌, బ్యాంకింగ్‌/ఫైనాన్స్‌, రిటైల్‌, జీవ విజ్ఞానం (లైఫ్‌ సైన్సెస్‌), బ్యూటీ రంగాలకు సంబంధించిన జీసీసీ కేంద్రాలు హైదరాబాద్‌ నుంచే ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. అమెరికా టెలికాం దిగ్గజం టీఎంయూఎస్‌ (టీ-మొబైల్‌ యుఎస్‌) గ్లోబల్‌ సొల్యూషన్స్‌ నూతన గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన గురువారం హైటెక్‌ సిటీలో లాంఛనంగా ప్రారంభించారు. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ టెక్నాలజీ సెంటర్‌ వచ్చే ఏడాది చివరి నాటికి వెయ్యి మంది నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఇప్పటికే 450 జీసీసీ కేంద్రాలకు నెలవుగా మారిన హైదరాబాద్‌ ఈ ఆధునిక కేంద్రంతో మరింత గుర్తింపును తెచ్చుకుంటుందన్నారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన ఎకో సిస్టం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్‌, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ గ్లోబల్‌ కంపెనీలను ఆకర్షిస్తోందని వివరించారు.

అంగన్వాడీ కేంద్రాలకు సెలవుల పొడిగింపు

ఎండలు మండుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఈ నెల 13 వరకు వేసవి సెలవులను పొడిగించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శృతి ఓఝ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 14న ఆదివారం కావడంతో 15 నుంచి అంగన్వాడీ కేంద్రాలను పునఃప్రారంభించాలని అందులో పేర్కొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 04:19 AM