Share News

ఆఫ్‌లైన్‌ ప్రక్రియలోనే బదిలీలు చేయండి

ABN , Publish Date - May 07 , 2026 | 05:49 AM

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో చేపట్టాలని ఆ శాఖలోని సంఘాలు సర్కారుకు విజ్ఞప్తి చేశాయి. ఆన్‌లైన్‌ విధానం వల్ల వెయిటేజి, సీనియారిటీ ప్రాధాన్యం..

ఆఫ్‌లైన్‌ ప్రక్రియలోనే బదిలీలు చేయండి

  • సర్కారును కోరిన వైద్యుల సంఘాలు

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో చేపట్టాలని ఆ శాఖలోని సంఘాలు సర్కారుకు విజ్ఞప్తి చేశాయి. ఆన్‌లైన్‌ విధానం వల్ల వెయిటేజి, సీనియారిటీ ప్రాధాన్యం, తుది కేటాయింపుల్లో పారదర్శకత లోపిస్తుందని వైద్యుల సంఘాలు ఆరోపించాయి. తక్షణమే ఆన్‌లైన్‌ బదిలీ విధానంపై సమీక్ష చేయాలని సర్కారును డిమాండ్‌ చేసింది. బుధవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలోని వైద్యుల బృందం రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌, ప్రజారోగ్య సంచాలకులను వేర్వేరుగా కలిసింది. ఆన్‌లైన్‌ విధానంపై తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ బృందంలో టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నరహరి, ఇతర సభ్యులు డాక్టర్‌ లాలూ ప్రసాద్‌, డాక్టర్‌ రౌఫుద్దీన్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా ఆఫ్‌లైన్‌లో బదిలీలు చేపట్టాలని కోరడంపై వైద్యశాఖలోని ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూనియన్ల పేరుతో ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 94 మంది వైద్యులు బదిలీల నుంచి తమను మినహాయించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను కోరారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాల్లో 720మంది ఆఫీసు బేరర్లు ఉన్నారని, ఇప్పుడు వారంతా సంఘాల పేర్లతో బదిలీల నుంచి మినహాయింపులు కోరితే అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌ పద్ధతిలోనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - May 07 , 2026 | 05:49 AM