బోధనాస్పత్రులకు గ్రూప్-1 అధికారులు వద్దు!
ABN , Publish Date - Mar 29 , 2026 | 07:19 AM
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పరిపాలన కోసం గ్రూప్-1 అధికారులను నియమించే ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ప్రతిపాదనపై వైద్య సంఘాల ఆందోళన
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పరిపాలన కోసం గ్రూప్-1 అధికారులను నియమించే ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనతో ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రుల సూపరింటిండెంట్ల అధికారం దెబ్బతింటుందని, వారి హోదా నామమాత్రంగా మారుతుందని శనివారం ఓ ప్రకటనలో ఆక్షేపించింది. ఈ విషయంలో గుర్తింపు పొందిన వైద్య సంఘాలను కనీసం సంప్రదించకపోవడం గర్హనీయమని పేర్కొంది. పాలనా బాధ్యతలను గ్రూప్-1 అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని టీజీజీడీఏ అధ్యక్షుడు నరహరి, ప్రధాన కార్యదర్శి లాలూ ప్రసాద్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బోధనాస్పత్రుల నిర్వహణ బాధ్యతను గ్రూప్-1 అధికారులను అప్పగించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ) ప్రకటించింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ విధానం అమల్లో లేదని పేర్కొంది. బోధనాస్పత్రులను సమర్థవంతంగా నిర్వహించడానికి పరిపాలనా అవగాహన, వైద్య పరిజ్ఞానం.. రెండూ అవసరమని, ఈ బాధ్యతలను వైద్యులే నిర్వర్తించగలరని టీటీజీడీఏ అధ్యక్ష కార్యదర్శులు బి.కిరణ్, మాదల కిరణ్ తెలిపారు.