పలు జిల్లాల్లో భారీ వర్షం
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:16 AM
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగినా కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం సాయంత్రానికి ఈదురుగాలులు...
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్న పంటలు
ఈదురు గాలులకు కూలిన విద్యుత్తు స్తంభాలు
నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరి మృతి
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగినా కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం సాయంత్రానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగినా.. రైతులు నష్టపోయారు. నిర్మల్ జిల్లా కుంటాలలో పిడుగుపాటుకు పశువుల కాపరి సుధాకర్(74) మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకుపోయింది. పలు మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసిన మొక్కజొన్న, జొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. పలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే పౌరసరఫరాల అధికారులు కొనుగోలు చేసి లారీల్లో రైస్‌మిల్లులకు తరలించారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న 10 లారీల మక్కల బస్తాలు, 2,500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నానిపోయింది. కరీంనగర్‌లో ఇళ్లలోకి నీరు చేరింది. పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌లలో ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కరెంటు తీగలపై పడడంతో గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది.