రైతులకు డిస్కమ్‌ల షాక్!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:51 AM
పీఎం- కుసుమ్ కింద బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టుకునే రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు షాక్ ఇచ్చాయి. ఈ ప్లాంట్ల నుంచి...
‘పీఎం కుసుమ్’ యూనిట్ ధర తగ్గింపు ప్రతిపాదన
తెలంగాణ ఈఆర్‌సీలో పిటిషన్ దాఖలు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పీఎం- కుసుమ్ కింద బీడు భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టుకునే రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు షాక్ ఇచ్చాయి. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.13 నుంచి రూ.2.98కి తగ్గించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)లో డిస్కమ్‌లు పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్రంలో పీఎం కుసుమ్ కాంపోనెంట్ కిందా 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు పెట్టుకోవడానికి 1,100 మంది రైతులు ముందుకొచ్చారు. వీరి నుంచి 25 ఏళ్ల పాటు 1,797 మెగావాట్ల కరెంట్‌ను కొనుగోలు చేసేందుకు డిస్కమ్‌లు ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నాయి. ప్రారంభంలో యూనిట్ ధర రూ.3.13గా ఈఆర్‌సీ అనుమతినిచ్చింది. అయితే, ప్లాంట్లకు ఉపయోగించే ఉపకరణాలపై జీఎస్టీ 12 నుంచి 5శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నందున.. విద్యుత్ కొనుగోలు ధరను 15పైసలు తగ్గించాలని డిస్కమ్‌లు కోరుతున్నాయి. అయితే డిస్కమ్‌ల ప్రతిపాదనలపై రైతులు పునరుత్పాదక ఇంధన నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. అవసరమైతే యూనిట్ ధర రూ.4కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిస్కమ్‌ల ప్రతిపాదనపై అభ్యంతరాలు తెలపడానికి ఈనెల 30 వరకు గడువు ఇస్తూ ఈఆర్‌సీ మంగళవారం అవకాశం కల్పించింది.