TS Discoms Petition: రూ.9,331 కోట్ల ట్రూ-అప్ వసూలు కోసం ఈఆర్‌సీకి డిస్కమ్‌ల పిటిషన్
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:53 AM
వినియోగదారుల నుంచి ట్రూ-అప్ ఛార్జీల రూపంలో రూ.9,331.09 కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ డిస్కమ్‌లు విద్యుత్ నియంత్రణ మండలి...
కరెంటు కొనుగోలుకు అంచనా వ్యయం కన్నావాస్తవ వ్యయం ఎక్కువ కావడమే ట్రూ-అప్
పెరిగిన ఈ ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి డిస్కమ్‌ల పిటిషన్లు
రూ.798కోట్ల ట్రూ-డౌన్ చెల్లింపుల కోసం కూడా
ఈఆర్‌సీ ఈ పిటిషన్లను యథాతథంగా అనుమతిస్తే వినియోగదారులపై రూ.8,532కోట్ల భారం
హైదరాబాద్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల నుంచి ట్రూ-అప్ ఛార్జీల రూపంలో రూ.9,331.09 కోట్లు వసూలు చేసుకోవడానికి తెలంగాణ డిస్కమ్‌లు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)ని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. కరెంటు కొనుగోలుకు ఈఆర్‌సీ ఆమోదించిన వ్యయం కన్నా వాస్తవిక వ్యయం అధికంగా ఉందని డిస్కమ్‌లు తమ పిటిషన్లలో పేర్కొన్నాయి. 2022-23 సంవత్సరంలో అనుమతించిన దానికన్నా విద్యుత్ కొనుగోళ్లకు రూ.4103.61 కోట్లు అధికంగా వెచ్చించామని దక్షిణ డిస్కమ్(టీజీఎస్పీడీసీఎల్-హైదరాబాద్), రూ.2779 కోట్లు ఎక్కువ ఖర్చు అయిందని ఉత్తర డిస్కమ్(టీజీఎన్పీడీసీఎల్-హన్మకొండ)లు పిటిషన్లు వేశాయి. ఇక 2023-24లో రూ.2,335.45 కోట్ల కోసం ఎస్పీడీసీఎల్, రూ.113.48 కోట్ల కోసం ఎన్పీడీసీఎల్ పిటిషన్లు వేశాయి. ఈ రెండేళ్లకాలానికి గాను వినియోగదారుల నుంచి రూ.9,331.09 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతి కోరాయి. మరోవైపు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనుకున్నదానికన్నా రూ.195.90 కోట్ల ఎక్కువ ఆదాయం వచ్చిందని దక్షిణ డిస్కమ్, రూ.113.48 కోట్లు అధిక ఆదాయం సమకూరిందని ఉత్తర డిస్కమ్‌లు ట్రూ-డౌన్(వినియోగదారులకు వెనక్కి ఇవ్వడానికి) పిటిషన్లు వేశాయి. వీటితో సహా మొత్తంగా రూ.798.87కోట్ల ట్రూ-డౌన్ పిటిషన్లు వేశాయి. ఈ పిటిషన్లపై అభ్యంతరాలు/సూచనలు/సలహాలు ఇవ్వడానికి ఈ నెల 31వ తేదీ దాకా గడువు ఇస్తూ ఈఆర్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 27న దీనిపై బహిరంగ విచారణ చేపట్టనుంది. ఆ తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. పిటిషన్లను ఈఆర్‌సీ యథాతథంగా అనుమతిస్తే వినియోగదారులపై రూ.8,532.22కోట్ల భారం పడనుంది. డిస్కమ్‌లు నియంత్రణలో లేని అంశాల కారణంగా కొనుగోలు, నిర్వహణ వ్యయం పెరిగితేనే ట్రూ-అప్ ఛార్జిలను వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ అనుమతిస్తుంది.ట్రూ-అప్ పిటిషన్లను డిస్కమ్‌లు ఈఆర్‌సీ దగ్గర సమర్పించినప్పటికీ ప్రభుత్వం నిర్ణయం ఆధారంగానే ఈఆర్‌సీ నడుచుకోనుంది. గతంలో 2016-2022 మధ్యలో రూ.12,718 కోట్లను ప్రజల నుంచి వసూలు చేయడానికి అనుమతినివ్వాలని డిస్కమ్‌లు పిటిషన్లను దాఖలు చేశాయి. అయితే, 2023లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ భారాన్ని ప్రజలపై వేయరాదని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ మొత్తాన్ని ఐదేళ్ల కాలానికి సమానంగా ఏటా రూ.2,543.6 కోట్లను చెల్లించడానికి అంగీకరించింది. ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం వార్షిక వడ్డీ ఎంత ఉంటుందో... ఆ వడ్డీతో సహా కలిపి డిస్కమ్‌లకు చెల్లింపులు చేయడానికి అంగీకార పత్రాన్ని సమర్పించింది. అయితే ఒక్కరూపాయి కూడా డిస్కమ్‌లకు చెల్లించకుండానే గత ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయింది.