No increase in Electricity Charges: కరెంట్ చార్జీల పెంపు లేదు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:21 AM
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ చార్జీలు పెంచరాదని డిస్కమ్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం...
డిస్కమ్‌ల సూత్రప్రాయ నిర్ణయం
22,100 కోట్ల లోటును ప్రభుత్వం నుంచి సబ్సిడీ కోరుతామని ఈఆర్‌సీకి నివేదన
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ చార్జీలు పెంచరాదని డిస్కమ్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ 1 నుంచి) విద్యుత్ వ్యాపారానికి సంబంధించి... డిస్కమ్‌లు వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్), టారిఫ్ ప్రతిపాదనలు దాఖలు చేశాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌ల ఆదాయానికి, అవసరాలకు మధ్య రూ. 22,100 కోట్ల అంతరం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో పొందనున్నట్లు డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి నివేదించాయి. దాంతో వీటిపై ఈనెల 31 లోపు అభ్యంతరాలు/సూచనలు/సలహాలు స్వీకరించనున్నారు. ఈ అభ్యంతరాలను డిస్కమ్‌లు ఫిబ్రవరి 10లోగా నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్చి 5న హన్మకొండ కలెక్టరేట్‌లో, మార్చి 7న హైదరాబాద్ జీటీఎస్ కాలనీలోని ఈఆర్‌సీ కార్యాలయంలో బహిరంగ విచారణ చేపట్టనున్నారు. వాస్తవానికి తెలంగాణ డిస్కమ్‌లు గత నవంబరు 29న ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేయగా... దీనిపై ఈఆర్‌సీ అభ్యంతరం తెలిపింది. దాంతో డిస్కమ్‌లు సవరించిన ఏఆర్‌ఆర్‌లు దాఖలు చేశాయి. దాంతో గురువారం దీనిపై బహిరంగ ప్రకటన వెలువడనుంది. ఇక దక్షిణ డిస్కమ్(టీజీఎస్పీడీసీఎల్)కు 2026-27లో ఆదాయ అవసరాలు రూ. 50,153కోట్లుగా ఉండగా... టారిఫ్ ద్వారా రూ.40,378 కోట్లు వస్తుందని, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీ/అదనపు సర్‌చార్జీ రూ. 198కోట్లు, టారిఫేతర ఆదాయం రూ. 83 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇక ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరం రూ.9494కోట్లుఉండగా... ఆ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా సమకూర్చనుందని దక్షిణ డిస్కమ్ ఈఆర్‌సీకి నివేదించింది. ఉత్తర డిస్కమ్ ఆదాయ లోటు రూ.10,606 కోట్లుగా ఉంటుందని అంచనా. దీన్ని కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో పొందుతామని డిస్కమ్ గుర్తు చేసింది. అభ్యంతరాలు/సూచనలు/సలహాల అనంతరం డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకున్న్జాక... మార్చి నాలుగో వారంలో టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది.