‘డిజిటల్ గవర్నెన్స్’కు రూ.2000 కోట్లు
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:55 AM
రాష్ట్ర ప్రజలకు అన్ని శాఖల ద్వారా ‘డిజిటల్ గవర్నెన్స్ (ఆన్‌లైన్ సేవలు)’ను అందించే దిశగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనికోసం అవసరమైన నిధుల సమీకరణ చర్యలు చేపడుతోంది.
ఆర్థిక సాయానికి ప్రపంచ బ్యాంకు అంగీకారం
డీపీఆర్‌ను సమర్పించాలన్న బ్యాంకు ప్రతినిధులు
ఇటీవల సీఎస్‌తో భేటీ అయిన బ్యాంకు బృందం
అన్ని శాఖల ఆన్‌లైన్ సేవలను ప్రజల వద్దకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ యోచన
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు అన్ని శాఖల ద్వారా ‘డిజిటల్ గవర్నెన్స్ (ఆన్‌లైన్ సేవలు)’ను అందించే దిశగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనికోసం అవసరమైన నిధుల సమీకరణ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రూ.2000 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రపంచ బ్యాంకు భరోసా ఇచ్చింది. ఈ మేరకు బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాలు వివరించాయి. ప్రపంచ బ్యాంకు డిజిటల్-ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేశ్ ఉత్తమ్ చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ నెల 3న సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డిజిటల్ సేవలు, మీ-సేవ కేంద్రాల ఆధునికీకరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన, కృత్రిమ మేధ(ఏఐ), సైబర్ భద్రత తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాలను మరింత పటిష్టపర్చి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎస్ వారికి వివరించారు. అయితే.. దేశంలో డిజిటల్ రంగంలో పెట్టుబడులకు హరియాణ, తెలంగాణ రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని, దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికల(డీపీఆర్)ను సిద్ధంచేసి, సమర్పించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎ్‌సకు సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక(పీపీఆర్)ను ప్రపంచ బ్యాంకుకు సమర్పించింది. డీపీఆర్‌ను సమర్పిస్తే.. నిధులపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
సీఎస్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ డీపీఆర్‌ను కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి, పనులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ పద్ధతిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నది ప్రభుత్వ యోచన. ఈ డిజిటల్ సేవల కోసం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత విస్తరించడం, ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచడం కోసం అధికారుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ కూడా డిజిటల్ గవర్నెన్స్ విస్తరణపై కసరత్తు చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.