డ్రోన్లతో ‘ఎమర్జెన్సీ’ అంచనా!
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:24 AM
రాష్ట్రంలో పోలీసు శాఖ అత్యవసర సేవలు ఇకపై మరింత వేగంగా అందనున్నాయి. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తెలుసుకునేందుకు డ్రోన్లను ‘ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లు’గా వినియోగించే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు..
పోలీసులు వెళ్లేలోపే ఘటనా స్థలానికి డ్రోన్లు
అక్కడ ఎలాంటి సేవలు అవసరమనే దృశ్యాలను స్థానిక పోలీసులు, కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయ్
నాలుగు కమిషనరేట్లలో డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్టు
ఘటనకు దగ్గర్లోని పెట్రోలింగ్ వాహనానికి ఆటోమేటిక్ అలర్ట్
అత్యవసర సేవలన్నింటికీ ఒకే నంబరు ‘డయల్ 112’ను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు శాఖ అత్యవసర సేవలు ఇకపై మరింత వేగంగా అందనున్నాయి. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తెలుసుకునేందుకు డ్రోన్లను ‘ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లు’గా వినియోగించే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారంగా తదుపరి తరం డయల్-112 అత్యవసర సేవల వేదికను బుధవారం ఆయన ప్రారంభించారు. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, విపత్తు నిర్వహణ, విద్యుత్ వంటి అన్ని అత్యవసర సేవలను ఒకే జాతీయ నంబరు 112తో అనుసంధానించారు. ఇప్పటి వరకు అత్యవసర సేవల కు వేర్వేరుగా నంబర్లు ఉన్నాయని, వాటన్నింటినీ డయల్ 112 కిందకు తీసుకొచ్చామని డీజీపీ ప్రకటించారు. డయల్ 112 పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అదే సమయంలో బంజారాహిల్స్‌లో రోడ్ ప్రమాదం జరిగిందని ఒక మహిళ ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన డయల్ 112 సిబ్బంది స్థానిక పోలీసులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతానికి డ్రోన్‌ను పంపడాన్ని డీజీపీ గమనించారు. పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లేలోపే డ్రోన్ ద్వారా ఘటనా స్థలంలోని పరిస్థితులు, ఎలాంటి సేవలు అవసరమనే దృశ్యాలను స్థానిక పోలీసులు, ఇటు కంట్రోల్‌రూంలోని సిబ్బంది గమనించి తగు సూచనలు ఇవ్వడా న్ని సీవీ ఆనంద్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌లో ఇదో చిరస్మరణీయమైన ఘట్టమన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు డయల్ 112 తొలి రక్షణ కవచంగా పనిచేస్తుందని, ప్రతి కాల్‌ను ఎంత వేగంగా, సమర్థంగా నిర్వహిస్తామన్న దానిపైనే పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం ఆధారపడి ఉంటుందని చెప్పారు. డయల్ 112 సేవలను ఏఐతో కలపడం వల్ల సేవల్లో 30శాతం వేగం పెరిగిందని, కొత్త వ్యవస్థలో ఏఐ ఆధారిత కాల్ ఫిల్టరింగ్, ఆటోమేటిక్ కాల్ రూటింగ్, వాయిస్ -టు-టెక్స్ట్, కచ్చితమైన లొకేషన్ గుర్తింపు వంటి సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. డయల్ 112కు రోజుకు 14 లక్షల ఫోన్‌కాల్స్ వస్తాయని అందులో స్పామ్, సైలెంట్, అనవసర కాల్స్‌ను ఏఐ ముందుగానే గుర్తించి తొలగిస్తూ, నిజమైన అత్యవసర కాల్స్‌కు ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. ప్రస్తుతం 94శాతం కాలర్ల లొకేషన్‌ను ఎల్‌బీఎస్ (లొకేషన్ బేస్డ్ సర్వీస్), ఏఎల్‌ఎస్ (అడ్వాన్స్‌డ్ లొకేషన్ సర్వీసెస్) సాయంతో గుర్తించే సామర్థ్యం ఈ సరికొత్త వ్యవస్థకు ఉంద ని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్లను ‘ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లు’గా వినియోగించనున్నామని, ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు అని ఆయన చెప్పారు.
పెట్రోలింగ్ వాహనాలను అనుసంధానించాం..
రాష్ట్రవ్యాప్తంగా 31 పోలీసు యూనిట్ల పరిధిలోని 1,860 పెట్రోలింగ్ వాహనాలను డిజిటల్‌గా అనుసంధానించామని కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని ఏఐ ఆధారిత వ్యవస్థ ఆటోమేటిక్‌గా గుర్తించి వేగంగా పంపిస్తుందని, 164 మంది శిక్షణ పొందిన సి బ్బంది ఈ కేంద్రంలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. త్వరలో ఫైరింజన్లు, అంబులెన్స్‌లను సైతం ఏఐతో అనుసంధానం చేస్తామన్నారు. డయల్ 100ను తాము స్వాధీనం చేసుకునే సమయం లో 118 ఇంటెలిజెంట్ ఫీచర్లు ఉండేవని, ప్రస్తుతం తాము 236 ఫీచర్లను డయల్ 112లో ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
డయల్ 112 ప్రత్యేకతలు
ఒకే నంబరుతో పోలీసు, ఫైర్, అంబులెన్స్, విద్యుత్, మహిళా రక్షణ సేవలు
ఏఐ ఆధారిత కాల్ ఫిల్టరింగ్, ఆటో డిస్పాచ్
వాయిస్ -టు-టెక్స్ట్ సదుపాయం
94శాతం కచ్చితమైన లొకేషన్ గుర్తింపు
డ్రోన్ ఆధారిత ఫస్ట్ రెస్పాన్స్ వ్యవస్ధ
రాష్ట్ర సగటు స్పందన సమయం 10 నిమిషాల 30 సెకన్లు
కాల్ ప్రాసెసింగ్ సమయం 190 నుంచి 133 సెకన్లకు తగ్గింపు
కాల్ టేకర్ సమయం 100 నుంచి 69 సెకన్లకు తగ్గింపు
డిస్పాచర్ సమయం 90 నుంచి 64 సెకన్లకు కుదింపు
118 ఫీచర్ల నుంచి 236 ఇంటెలిజెంట్ ఫీచర్లకు విస్తరణ
1,860 పెట్రోలింగ్ వాహనాల డిజిటల్ అనుసంధానం