ధరణి టెండర్ పారదర్శకంగా జరిగిందా?
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:37 AM
ధరణి పోర్టల్‌లో అవకతవకలు, అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని(స్పెషల్ ఎంక్వైరీ టీమ్-సెట్) ఏర్పాటు చేసింది.
చారు సిన్హా కమిటీ బాధ్యతల్లో ఇదీ ఒకటి
ధరణి అవకతవకలపై సెట్... జీవో జారీ
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో అవకతవకలు, అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని(స్పెషల్ ఎంక్వైరీ టీమ్-సెట్) ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిణి, సీఐడీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ మొదలు పోర్టల్ రూపకల్పన, సాంకేతిక లోపాలు, డేటా భద్రత, అక్రమ లావాదేవీలు తదితర అంశాలన్నింటిపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. సెట్ సభ్యులుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, రాష్ట్ర సాంకేతిక సమాచార(ఐటీ) శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎ్‌సబీ) ఎస్పీ హర్షవర్ధన్, ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ మంద మకరందులను సభ్యులుగా, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ) ప్రతినిధిని సాంకేతిక నిపుణుడిగా, సీసీఎల్‌ఏలోని సమగ్ర భూ రికార్డుల మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్(సీఎంఆర్‌ఓ) ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ్ చౌహాన్‌ను కన్వీనర్‌గా ఈ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ, మెయింటెనెన్స్ కాంట్రాక్టు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వంచారా లేదా అన్నది సెట్ నిగ్గుతేల్చాలి. గడువులోగానే కాంట్రాక్టును అప్పగించారా? దివాలా ఆరోపణల్లో నిజమెంత? కాంట్రాక్టు అమలులో ఉండగా విదేశీ సంస్థలకు యాజమాన్య హక్కులు మారాయా? ధరణిలో వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం కలిగిందా? చెల్లింపులు లేకుండానే లావాదేవీలు, అసాధారణ సమయాల్లో లావాదేవీలు జరిగాయా? సిస్టమ్ లాగ్‌లు లేకపోవడం, దరఖాస్తుదారుల ఐపీ అడ్ర్‌సలు నమోదు కాకపోవడం, లావాదేవీల ఐడీలు సరిపోలక పోవడం వంటి వివరాలు సేకరించాలి. అక్రమాలు నిజమని తేలితే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలి. ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు కేసులను అప్పగించాలా అనేది సూచించాలి. అత్యవసరం అయితే మధ్యంతర నివేదికలు కూడా సమర్పించవచ్చని తెలిపింది.