Share News

ఉద్యమ సమయంలో పోలీసులు, ప్రజల మధ్య గ్యాప్‌!

ABN , Publish Date - May 01 , 2026 | 05:13 AM

తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు అనుసరించిన విధానాల వల్ల ప్రజలకు, పోలీసులకు మధ్య అంతరం పెరిగిందని, 16 ఏళ్ల తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల భావాలను పోలీసులు...

ఉద్యమ సమయంలో పోలీసులు, ప్రజల మధ్య గ్యాప్‌!

  • తెలంగాణ ఉద్యమాన్ని పోలీసులు అణచివేశారనే అభిప్రాయం ఏర్పడింది

  • ఆ అంతరాన్ని తొలగించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల్లోకి వెళ్లాం

  • డీజీపీ శివధర్‌ రెడ్డి

  • ఉద్యోగ విరమణ చేసిన శివధర్‌రెడ్డి... ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌, మెహదీపట్నం, నార్సింగ్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు అనుసరించిన విధానాల వల్ల ప్రజలకు, పోలీసులకు మధ్య అంతరం పెరిగిందని, 16 ఏళ్ల తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల భావాలను పోలీసులు అణచివేశారనే పేరు ఉందని డీజీపీ శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఏర్పడిన ఆ అంతరాన్ని తగ్గించడం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ ద్వారా ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించగలిగామని వివరించారు. చిన్ననాటి నుంచే స్వరాష్ట్రం ఏర్పడాలనే కాంక్ష తనలో ఉండేదని, సిద్ధించిన తెలంగాణ రాష్ట్రానికి తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని పేర్కొన్నారు. సీఎం తనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పగించారని, ఆయన విజన్‌కు అనుగణంగా తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. డీజీపీగా శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేశారు. శుక్రవారం కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం హిమాయత్‌సాగర్‌లోని పోలీస్‌ అకాడమీలో శివధర్‌ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివధర్‌రెడ్డికి సహచర ఐపీఎస్‌ అధికారులు, వందలమంది పోలీసు సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. కార్యాలయం ప్రాంగణంలో పూలతో అలంకరించిన ఓపెన్‌టా్‌ప జీపులో శివధర్‌ రెడ్డి నిల్చోగా ఐపీఎస్‌ అధికారులు ఆ వాహనానికి కట్టిన తాళ్లను లాగుతూ గౌరవప్రదంగా ప్రవేశద్వారం ఆవలి వరకు తీసుకెళ్లారు. సాయంత్రం 4గంటలకు డీజీపీ చార్జిని శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేశ్‌ భగవత్‌కు అప్పగించారు. అంతకుముందు ఉదయం అకాడమీలో డీ జీపీ శివధర్‌రెడ్డికి వీడ్కోలు పరేడ్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా వస్తున్న సీవీ ఆనంద్‌ సవాళ్లను దీటుగా స్వీకరించే అధికారి అని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న సీవీ ఆనంద్‌ మాట్లాడారు. పోలీసు వృత్తిలో శివధర్‌ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, ఆపరేషన్‌ కగార్‌ సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవడంలో డీజీపీ శివధర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని, పోలీసు కుటుంబాల కోసం ఎన్నో సంస్కరణలు అమలు చేశారని పేర్కొన్నారు.

Updated Date - May 01 , 2026 | 05:13 AM