తుది దశకు డీజీపీ ఎంపిక ప్రక్రియ
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:37 AM
తెలంగాణకు రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై బుధవారం న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది.
ఢిల్లీలో ఎంపిక కమిటీ కీలక సమావేశం
సీఎస్ రామకృష్ణారావు హాజరు
పరిశీలనలో సీవీ ఆనంద్ సహా నలుగురి పేర్లు
న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై బుధవారం న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి సీఎస్ రామకృష్ణారావు హాజరై రాష్ట్రం నుంచి తదుపరి డీజీపీ నియామకానికి సంబంధించి సీనియారిటీ జాబితాను ఎంపిక కమిటీకి అందజేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందులో సీవీ ఆనంద్ సీనియర్ కాగా.. ఈ పదవి కోసం ముగ్గురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే... కొత్త బాస్ ఎంపిక కోసం నలుగురిలో ముగ్గురి పేర్లను కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసుచేస్తుంది. ఇందులో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.