Share News

రాష్ట్రంలో నక్సలిజం లేదు

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:10 AM

రాష్ట్రంలో నక్సలిజం ప్రాబల్యం లేదని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆరుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోతారని చెప్పారు.

రాష్ట్రంలో నక్సలిజం లేదు

  • ఆరుగురు మావోయిస్టులే ఉన్నారు.. వాళ్లు కూడా త్వరలో లొంగిపోతారు

  • ములుగు పర్యటనలో డీజీపీ శివధర్‌రెడ్డి

ములుగు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నక్సలిజం ప్రాబల్యం లేదని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆరుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోతారని చెప్పారు. ములుగు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్‌) సువర్ణ, ఎస్‌ఐబీ డీఐజీ సుమతి, సీఆర్పీఎఫ్‌ దక్షిణ విభాగం ఐజీ విక్రమ్‌తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అనుసంధానంలో వ్యూహాత్మక ప్రాంతంగా నిలిచిన కర్రెగుట్టల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో డీజీపీ వాజేడు మండలం మురుమూరు, వెంకటాపురం మండలం పామునూరు గుట్టల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పామునూరు గుట్టలకు చేరుకున్న ఆయన అక్కడ పోలీస్‌ ఔట్‌పోస్టు, ఇంటర్‌ ఏజెన్సీ కోఆర్డినేషన్‌ సెంటర్‌ నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మా ట్లాడుతూ ఇన్నాళ్లూ తీవ్రవాదం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కర్రెగుట్టలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు నక్సల్స్‌ అడా డగా ఉన్న కర్రెగుట్టల్లో నేడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కర్రెగుట్టల్లో రోడ్ల నిర్మాణం చరిత్రాత్మక అంశమని, వాటితో ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని చెప్పారు. మురుమూరు నుంచి పామునూరు వరకు సుమారు 8.7 కి.మీ. రహదారిని కేవలం నెల రోజుల్లో పూర్తి చేయడం అభినందనీయమన్నారు. రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేశాయని కొని యాడారు. పామునూరు నుంచి జెల్లా, డోలి, తడపల వరకు రోడ్డు నిర్మాణం జరుగుతోందని, కర్రెగుట్టల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. పామునూరు ఆదివాసీల కోసం మంచినీటి బోరు కూడా వేసినట్టు తెలిపారు. వారికి రవాణా సౌకర్యం కోసం ఆటో, ద్విచక్ర వాహనాన్ని డీజీపీ అందజేశారు. నిత్యావసరాలనూ పంపిణీ చేశారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఏయే పంటలు పండిస్తారని అడిగి తెలుసుకున్నారు. పామునూరు రోడ్డు అటవీ చట్టాలకు లోబడే రోడ్డు నిర్మించారని పీసీసీఎఫ్‌ సువర్ణ చెప్పారు. కర్రెగుట్టల అభివృద్ధికి సమాలోచనలు చేస్తున్నామని, ఎకో టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 06:10 AM