Share News

ఠాణాలు వదిలి బయటకు రండి

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:20 AM

‘‘పోలీసులు స్టేషన్లలో కూర్చోవడమే కాదు.. రోడ్ల మీద కన్పిస్తుండాలి. కానిస్టేబుల్‌, ఐపీఎస్‌ అనే తేడా లేకుండా పోలీసులందరూ తమ పరిధిలో రోజూ ఎక్కడో ఒకచోట పర్యటించాలి’’ అని రాష్ట్ర పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్‌ దిశానిర్దేశం చేశారు.

ఠాణాలు వదిలి బయటకు రండి

  • క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ కన్పించాలి.. విజిటింగ్‌ అవర్స్‌ తప్పనిసరిగా అమలు చేయాలి

  • ప్రజలకు చేరువవడమే అసలైన పోలీసింగ్‌: డీజీపీ సీవీ ఆనంద్‌

  • రాష్ట్రంలో అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో సమీక్ష

  • రాష్ట్రంలో సీసీటీఎన్‌ఎస్ అప్‌డేషన్‌ 70శాతం పూర్తయిందని వెల్లడి

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘‘పోలీసులు స్టేషన్లలో కూర్చోవడమే కాదు.. రోడ్ల మీద కన్పిస్తుండాలి. కానిస్టేబుల్‌, ఐపీఎస్‌ అనే తేడా లేకుండా పోలీసులందరూ తమ పరిధిలో రోజూ ఎక్కడో ఒకచోట పర్యటించాలి’’ అని రాష్ట్ర పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్‌ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి పోలీసింగ్‌తోనే ప్రజలకు చేరువ కాగలమని ఆయన స్పష్టం చేశారు. డీజీపీ శుక్రవారం అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని.. విజిబుల్‌ పోలీసింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారీ ప్రజలతో మమేకమై పనిచేయాలని, యూనిట్‌ అధికారులు తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శించి అక్కడి పరిస్థితులు, కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఠాణాల్లో సందర్శన వేళలను తప్పనిసరిగా అమలు చేయాలని.. క్యాంప్‌ ఆఫీస్‌ విధానానికి బదులుగా అధికారులు తమ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. కొంతమంది పోలీసు అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటివారు ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. భూవివాదాల వంటి సివిల్‌ స్వభావం గల వ్యవహారాల్లో పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకోరాదని డీజీపీ సూచించారు. అలాగే.. సోషల్‌ మీడియాలో వ్యాప్తిచెందేతప్పుడు ప్రచారాలు, వదంతులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.


కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలని.. సీసీటీఎన్‌ఎస్‌ (క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌), ఈ-సాక్ష్యం, లాటీ యాప్‌ వంటి డిజిటల్‌ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఉపయోగించాలని డీజీపీ సూచించారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కూ సంబంధించిన వివరాలను ‘ఈ-సాక్ష్యం’ పోర్టల్‌లో సకాలంలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో సీసీటీఎన్‌ఎస్‌ అప్‌డేషన్‌ 60 నుంచి 70 శాతం వరకూ పూర్తయిందన్న ఆయన.. ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలు ఈ ప్రక్రియలో ముందంజలో ఉన్నాయని ప్రశంసించారు. ఈ-సాక్ష్యం వినియోగంలో భూపాలపల్లి 55ు, సిద్థిపేట 39ు, నల్గొండ 31ు పురోగతి సాధించినట్టు తెలిపారు. ఈ-సమన్ల అమలులో కామారెడ్డి 92.86ు, వనపర్తి 92ు పనితీరు కనబరిచాయని పేర్కొంటూ.. మిగతా జిల్లాలు కూడా అదే స్థాయిలో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. పోలీసు అధికారులు నిరంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, దీనికి సంబంధించి తాము కూడా కొత్త అంశాలపై తరచూ ప్రత్యేక శిక్షణలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా సైబర్‌ నేరాల్లో 70 శాతానికి పైగా హైదరాబాద్‌లోని నాలుగు కమిషనరేట్ల పరిధిలోనే నమోదవుతున్న నేపథ్యంలో.. వాటి దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. నార్కోటిక్స్‌, గంజాయి నిర్మూలనకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం పోలీసుల సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే.. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్‌ అండ్‌ సేఫ్టీ కమిటీలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.


‘అరైవ్‌ అలైవ్‌’తో సత్ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమం వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గిందని ఆనంద్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, అత్యవసర సేవల స్పందనను వేగవంతం చేయాలని ఆదేశించారు. 112 అత్యవసర సేవలను డ్రోన్‌ ఇంటిగ్రేషన్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని త్వరలో ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిపారు. విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఈసందర్భంగా డీజీపీ అభినందించారు. వారందరికీ రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.

Updated Date - Jul 04 , 2026 | 06:22 AM