డ్రగ్స్ స్మగ్లర్లను మావోల కంటే తీవ్రంగా పరిగణిస్తాం
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:21 AM
రాష్ట్రంలోని గంజాయి, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, క్రయ విక్రయదారులను మావోయిస్టుల కంటే తీవ్రంగా పరిగణిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
డీజీపీ సీవీ ఆనంద్
మణుగూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గంజాయి, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, క్రయ విక్రయదారులను మావోయిస్టుల కంటే తీవ్రంగా పరిగణిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ, నివారణకు పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సోమవారం నూతన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమాజాన్ని పట్టి పీడుస్తున్న సమస్యల్లో మాదకద్రవ్యాల వినియోగం అతితీవ్రంగా మారిందని, దానిని అరికట్టేందుకు పోలీసు శాఖ పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సమాజాన్ని నాశనం చేసే, యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపే డ్రగ్స్ వ్యవస్థను కూకటివేళ్లతో సహా తొలగిస్తామన్నారు. అందుకోసం ఈగల్ ఫోర్స్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 30 ఏళ్ల నుంచి ఎలాగైతే నక్సలైట్, మావోయిస్టులపై దృష్టిసారించి అదుపు చేయగలిగామో.. అదేవిధంగా మాదకద్రవ్యాల నివారణపై కూడా వ్యహరిస్తామని డీజీపీ అన్నారు.