Share News

రెగ్యులర్‌ డీజీపీపై ఉత్కంఠ

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:06 AM

తెలంగాణకు నాలుగు వారాల్లో రెగ్యులర్‌ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై పోలీస్‌ శాఖలో ...

రెగ్యులర్‌ డీజీపీపై ఉత్కంఠ

  • నాలుగు వారాల్లో ప్రక్రియ పూర్తికి సుప్రీం కోర్టు ఆదేశం

  • జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయోనని ఆసక్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు నాలుగు వారాల్లో రెగ్యులర్‌ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనిపై పోలీస్‌ శాఖలో చర్చ మొదలైంది. యూపీఎస్సీ పంపే తుది జాబితాలో ఏ ముగ్గురు అధికారుల పేర్లు ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది. పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లోనే ప్రారంభించింది. అప్పట్లో డీజీపీ ఉద్యోగానికి అర్హత ఉన్న 8 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లతో ఓ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. అందులో అప్పటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా కొనసాగిన సీవీ ఆనంద్‌, డీజీపీగా ఉన్న జితేందర్‌, కేంద్ర సర్వీసులో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేస్తున్న వినాయక్‌ ఆప్టే ప్రభాకర్‌, విజిలెన్స్‌ డీజీగా కొనసాగిన కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న బి.శివధర్‌రె డ్డి, జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్యామిశ్రా, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా ఉన్న శిఖాగోయల్‌ పేర్లు పంపారు. ఈ క్రమంలో ఏపీ క్యాడర్‌ నుంచి తెలంగాణకు డీజీపీ స్థాయి అధికారిణి అభిలాష బిస్త్‌ కూడా వచ్చారు. ఈ జాబితాపై యూపీఎస్సీ అభ్యంతరాలు తెలపటంతో రెగ్యులర్‌ డీజీపీ నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఈ మధ్య కాలంలోనే శ్రీనివా్‌సరెడ్డి, జితేందర్‌ పదవీ విరమణ చేశారు. రవి గుప్తా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తదనంతరం శివధర్‌ రెడ్డిని ప్రభుత్వం యాక్టింగ్‌ డీజీపీగా నియమించి, సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ జాబితాలో సీవీ ఆనంద్‌, వినాయక్‌ ఆప్టే ప్రభాకర్‌, బి.శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, శిఖాగోయల్‌ ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూపీఎస్సీ ఎంప్యానల్‌మెంట్‌ కమిటీ వీరిలో ముగ్గురి పేర్లను పూర్తిస్థాయి డీజీపీ కోసం సిఫారసు చేయనుంది. అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. జాబితాలో నలుగురు 1994 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, సీవీ ఆనంద్‌ 1991 బ్యాచ్‌. వీరిలో శివధర్‌రెడ్డికి ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకు, శిఖాగోయల్‌కు 2029 వరకు, సౌమ్యా మిశ్రాకు 2027 వరకు, వినాయక్‌ ఆప్టే ప్రభాకర్‌కు 2029 వరకు, ఆనంద్‌కు 2028 వరకు సర్వీసు ఉంది. దీంతో యూపీఎస్సీ నుంచి వచ్చే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే అంశంపై పోలీస్‌ శాఖతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది.


డీజీపీ నియామకంపై పిటిషన్‌ ఉపసంహరణ

డీజీపీగా బీ శివధర్‌రెడ్డి నియామకం చెల్లదంటూ హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను పిటిషనర్‌ టీ ధన్‌గోపాలరావు ఉపసంహరించుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు రెగ్యులర్‌ డీజీపీల నియామక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్‌ డీజీపీని నియమించే వరకు శివధర్‌రెడ్డిని తాత్కాలిక డీజీపీగా కొనసాగించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తన పిటిషన్‌కు కాలం చెల్లిపోయినందున ఉపసంహరించుకున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - Feb 07 , 2026 | 04:06 AM