Share News

రోడ్డు భద్రతకు బ్యూరో!

ABN , Publish Date - May 02 , 2026 | 05:26 AM

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి రాష్ట్ర స్ధాయిలో రోడ్డు భద్రత నిర్వహణ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రకటించారు.

రోడ్డు భద్రతకు బ్యూరో!

  • పోలీసు శాఖలో సిబ్బందితో ప్రత్యేక విభాగం.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ట్రాఫిక్‌ నిబంధనలు

  • టెక్నాలజీ చాలదు... పోలీసులు లెగ్‌ వర్క్‌ చేయాలి

  • వ్యవస్ధీకృత నేరగాళ్ల ముఠాల అంతు చూస్తాం

  • త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ: ఆనంద్‌

  • డీజీపీగా బాధ్యతల స్వీకారం

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి రాష్ట్ర స్ధాయిలో రోడ్డు భద్రత నిర్వహణ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. శుక్రవారం ఇన్‌ఛార్జి డీజీపీ మహేష్‌ భగవత్‌ నుంచి బాధ్యతలు తీసుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగణంగా పోలీసుల పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు. తన మీద నమ్మకం ఉంచి డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీసులు దేశంలో ఒక బ్రాండ్‌గా నిలుస్తూ నెంబర్‌ 1 స్ధానం సంపాదించుకున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఏఐని ఉపయోగించుకుంటూ మరిన్ని విజయాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నేరాల స్వరూపం మారుతోందని, నేరగాళ్లు సైతం పోలీసులకు పోటీగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలచుకుని పంజా విసురుతున్నారని చెప్పారు. అప్రమత్తతే దీనికి మందు అన్నారు. సైబర్‌ సెక్యూరిటీ ముప్పును సామూహిక సమస్యగా గుర్తించి మూకుమ్మడి దాడికి పాల్పడితే సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేయవచ్చన్నారు. మత్తుమందు కట్టడికి రాష్ట్రమంతా ఏకీకృత విధానాలను అవలంబించాలని, ప్రభుత్వ శాఖల సమన్వయంతో విద్యాలయాలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా 7,500 మందిమరణిస్తున్నారని, దీనిని నివారించడానికి సమగ్ర వ్యూహన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. అందుకే, రాష్ట్రస్థాయిలో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు ఇంజనీరింగ్‌, ఫుట్‌ పాత్‌ ఆక్రమణల తొలగింపు, ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్‌ స్పాట్‌ల గుర్తింపు బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. ట్రాఫిక్‌ నిబంధనలు రాష్ట్ర మంతటా ఒకే విధంగా అమలు చేస్తామన్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ లాంటి ప్రాథమిక ఉల్లంఘనలపై అన్ని చోట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.


మానవ అక్రమ రవాణాలో వ్యవ స్ధీకృత నేరగాళ్ల ముఠాలు తయారయ్యాయని, వాటి అంతు చూస్తామని హెచ్చరించారు. సిబ్బందిపై ఆడిట్‌ నిర్వహించి గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీలలో మిగులు సిబ్బంది సీఐడీ, ఏసీబీ, ఈగల్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు కేటాయిస్తామన్నారు. 19 వేల పోలీసుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తొలి దశలో 5 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆమోదం లభించిందని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న కొద్దిమంది మావోయిస్టు నాయకులు జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. సోషల్‌ మీడియాలో ఇతరుల వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు పెట్టడం, దూషణలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆనంద్‌ తేల్చిచెప్పారు. యువ అధికారులు ఆఫీసులు వదలి ప్రజల మధ్యకు వస్తేనే విషయాలు అర్ధం అవుతాయని చెప్పారు. నేరాల దర్యాప్తులో పూర్తిగా సీసీ కెమేరా ఫుటేజ్‌పైనే ఆధార పడుతున్నార ని, అవి లేనిచోట అశక్తులుగా మారుతున్నారని, ఇది ప్రమాదకరమైన ట్రెండ్‌ అని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తులో లెగ్‌వర్క్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విపత్తు సమయాల్లో హైడ్రా, ఫైర్‌ , విపత్తు నిర్వహణ బృందాలు కలిసి అందరికన్నా ముందు స్పందించేలా శిక్షణ ఇస్తామని చెప్పారు. స్టేషన్‌కు వచ్చేవారిని లంచాల పేరుతో వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూడు లక్షల సీసీ కెమెరాల్లో 32 శాతం మాత్రమే పని చేస్తున్నాయని, కొత్త కెమెరాల ఏర్పాటు కన్నా ముందు పాత వాటి మరమ్మతుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ తుది దశకు వచ్చిందని, మరికొద్ది రోజుల్లో అదనపు చార్జిషీట్‌ కోర్టులో దాఖలు చేయనున్నామని తెలిపారు.

సీఎంను కలిసిన డీజీపీ

బాధ్యతల స్వీకారం అనంతరం డీజీపీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారమే బాధ్యతలు స్వీకరించిన ఇతర అధికారులు శిఖాగోయల్‌, తరుణ్‌ జోషి, సుమతి, డీఎస్‌ చౌహాన్‌, అవినాశ్‌ మహంతి, షానవాఆజ్‌ ఖాసింలు ముఖ్యమంత్రిని కలిశారు. భద్రతా సలహాదారుగా నియమితులైన మాజీ డీజీపీ శివ్‌ధర్‌రెడ్డి కూడా సీఎంను కలిశారు.

Updated Date - May 02 , 2026 | 05:26 AM