Share News

అభివృద్ధిలో దేశానికి మోడల్‌గా తెలంగాణ

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:11 AM

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలుస్తోందని, ఇక్కడ పుట్టడం, పెరగడం అదృష్టమని ప్రతీ బిడ్డ, ప్రతీ కుటుంబం అనుకునేలా భరోసా కల్పిస్తూ ....

అభివృద్ధిలో దేశానికి మోడల్‌గా తెలంగాణ

  • ఇక్కడ పుట్టడం అదృష్టమని భావించేలా పాలన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • పాలనను గాలికొదిలేసిన బీఆర్‌ఎస్‌

  • లక్ష కోట్ల కమీషన్‌ కోసమే కాళేశ్వరం

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

  • ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులు,

  • పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టు ప్రారంభం

సత్తుపల్లి/పెనుబల్లి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలుస్తోందని, ఇక్కడ పుట్టడం, పెరగడం అదృష్టమని ప్రతీ బిడ్డ, ప్రతీ కుటుంబం అనుకునేలా భరోసా కల్పిస్తూ ఇందిరమ్మ ప్రజాపాలన సాగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, నిధులు కేటాయిస్తోందని చెప్పారు. బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెనుబల్లి మండలం బ్రహ్మాళకుంట సమీపంలోని పులిగుండాల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించారు. సత్తుపల్లిలో జరిగిన సభలో, పులిగుండాల వద్ద ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క ఏడాదిలోనే 14 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్స్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రాష్ట్రంలో పేదలు కార్పొరేట్‌ స్థాయిలో పోటీ పడేలా 100 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రతీ నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను మంజూరుచేస్తామన్నారు. పులిగుండాలను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాటేజీల నిర్మాణానికి సీఎస్ఆర్‌ నిధులు రూ.4 కోట్లు మంజూరు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు తమ పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని మంత్రి పొంగులేటి విమర్శించారు. తమకు ఇళ్లు మంజూరు చేయాలని పేదలు ఎంత ప్రాధేయపడినా నాడు ఆ దొరలకు కనికరం కలగలేదని, కానీ కమీషన్లు వస్తాయని రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మండిపడ్డారు. గత పాలకులు విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అసంపూర్తిగా ఉన్న ఆస్పత్రులను తమ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తెస్తోందన్నారు. ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, ్డ జారె ఆదినారాయణ, పీసీసీఎఫ్‌ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 04:11 AM