దేవాదాయ శాఖలో అధికారుల లీలలు!
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:04 AM
దేవాదాయ శాఖ నిర్వహణ దైవాదీనంగా మారింది. అధికారులు అవకాశం మేరకు తమకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఓ వైపు దేవాదాయ శాఖ మంత్రికి శాఖపై పట్టు లేకపోవడం మరోవైపు శాఖను సమర్థవంతంగా నిర్వహించాల్సిన ఉన్నతాధికారులు...
భక్తుల కానుకలు కాంట్రాక్టర్ల పాలు.. ధూపదీపంలో చేర్చేందుకు అర్చకుల నుంచి భారీగా వసూళ్లు
పదోన్నతులు, పోస్టింగుల్లో ఇష్టారాజ్యం
ఎక్కడికక్కడ ఇన్‌చార్జిలకు బాధ్యతలు
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖ నిర్వహణ దైవాదీనంగా మారింది. అధికారులు అవకాశం మేరకు తమకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఓ వైపు దేవాదాయ శాఖ మంత్రికి శాఖపై పట్టు లేకపోవడం మరోవైపు శాఖను సమర్థవంతంగా నిర్వహించాల్సిన ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టదైవానికి భక్తులు సమర్పించే కానుకలు లెక్కాపత్రం లేకుండా పోతున్నాయి. ఆర్జిత సేవల నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కాంట్రాక్టర్లు, కన్సల్టెన్సీల పేరిట అధికారులు బయటి వారికి ఇష్టానుసారంగా దోచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వేలు, మాస్టర్‌ప్లాన్లు ఇష్టానుసారంగా చేపడుతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీలు భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తమ కన్సల్టెన్సీల ద్వారా నియమించుకుని వాటికి పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. గతేడాది సరస్వతి పుష్కరాల సమయంలో ఓ అధికారి తన బినామీ సంస్థకు పనులు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించిన భూముల్లో మూడో వంతు ఆక్రమణల్లో ఉన్నాయి. వాటిని గుర్తించి, స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన సర్వేలోనూ ఉన్నతాధికారులు తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. తక్కువ ధరకు సేవలందించే ఏజెన్సీలను తప్పించి ఎక్కువ మొత్తానికి తమ బినామీ సంస్థలకే పనులు కట్టబెట్టినట్లు తెలిసింది.
ధూపదీపానికి లంచాలు...
దేవాలయాల్లోని అర్చకులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ. 10 వేల గౌరవ వేతనం చెల్లిస్తోంది. అందులో రూ. 4 వేలు ధూప దీపం, నైవేద్యం ఖర్చులకు పోను మిగిలిన రూ. 6 వేలు అర్చకుడి వేతనంగా చెల్లిస్తోంది. అయితే ఇదేదో పెద్ద ఉద్యోగంగా చూపించి కొందరు అధికారులు ధూపదీపం పథకంలో ఆలయాన్ని చేర్చి అర్చకుడికి గౌరవ వేతనం ఇప్పించేందుకు లంచాలు వసూలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. డీడీఎన్‌ఎస్ ఇప్పించేందుకు ఒక్కొక్కరి నుంచి అధికారులు రూ.50 వేల నుంచి లక్ష తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018లో విధుల్లో చేరిన వారిని సైతం ఇష్టానుసారంగా జాబితాలో చేర్చి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయాల్లో సిబ్బంది పదోన్నతులు, పోస్టింగుల్లో ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ కేడర్ అధికారి ఈవోగా ఉండాల్సిన నాచారంలోని ఆలయానికి గ్రేడ్-2 ఈవోకు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న గ్రేడ్-2 ఈవోను మల్టీజోన్ 1లో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో ఇన్‌చార్జిగా నియమించారు. ఖమ్మం, కరీంనగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆఫీసు సూపరింటెండెంట్లను జిల్లా స్థాయి ఏసీ పోస్టుల్లో నియమించారు. అలాగే, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించకుండా... అవసరమైన వారిని ఇన్‌చార్జులుగా నియమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఈవోగా ఉన్న రామకృష్ణారావును రీజినల్ జాయింట్ కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ధర్మపురి, చెరువుగట్టు, బల్కంపేట, నాచారం, కొండగట్టు, బాసర, వరంగల్ భద్రకాళీ, కురవి వీరభద్రస్వామి, జోగులాంబ, మేడారం వంటి అత్యంత కీలకమైన ఆలయాలకు కూడా ఇన్‌చార్జి ఈవోలనే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఇన్‌చార్జిల పాలనకు స్వస్తి పలికి సీనియార్టీ, అర్హత ఆధారంగా పదోన్నతులు కల్పించి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.