బదిలీ అయిన చోట విధుల్లో చేరకుంటే వేటు!
ABN , Publish Date - May 21 , 2026 | 03:38 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా బదిలీ అయినా.. సదరు పోస్టుల్లో చేరని అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఉట్నూర్ ఆర్డీవో పోస్టులో చేరని డిప్యూటీ కలెక్టర్ షర్మిల సస్పెన్షన్
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా బదిలీ అయినా.. సదరు పోస్టుల్లో చేరని అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్ షర్మిలను మంగళవారం సస్పెండ్ చేసింది. రెవెన్యూ శాఖలో హెచ్‌ఎండీఏ పరిధిలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న షర్మిలకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. బదిలీ ఉత్తర్వులు జారీ చేసి 16 రోజులవుతున్నా ఆమె విధుల్లో చేరలేదు. దీనితో షర్మిలను సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ఆర్డీఓకు ఎన్నికలకు సంబంధించిన అధికారిక బాధ్యతలు కూడా ఉంటాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, మ్యాపింగ్ ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల విధుల్లో చేరకపోవడం ప్రభావం చూపిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఆమెను ఆదేశించారు. ఇదే తరహాలో విధుల్లో చేరని మరో ఇద్దరు అధికారులపైనా ఒకటీ రెండు రోజుల్లో వేటుపడే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.