యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:15 AM
సింగరేణిలో వివిధ కారణాలతో కొద్దికాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు.
పారదర్శకంగా కారుణ్య నియామకాలు చేపట్టాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశం
నేడు మంచిర్యాలలో 335 మంది కార్మికుల వారసులకు నియామక పత్రాలు
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో వివిధ కారణాలతో కొద్దికాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. మెడికల్ బోర్డు ద్వారా అర్హులైన కార్మికులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల కింద ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డును నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలన్నారు. సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారని చెప్పారు. ఇటీవలకాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశం తమ దృష్టిలో ఉందని, దీన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.