Share News

బీఆర్‌ఎస్‌ విధ్వంసం వల్లే ఛిన్నాభిన్నం

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:54 AM

చెల్లింపులు వాయిదా వేసి.. ఆర్థికభారం తప్పించుకునేందుకే రిటైర్‌మెంట్‌ వయసును మూడేళ్లకు పెంచారు.. దీనివల్ల మార్చి 2021 నుంచి 2024 మార్చి మధ్యలో పదవీ విరమణ చేయాల్సిన 17వేలమంది...

బీఆర్‌ఎస్‌ విధ్వంసం వల్లే ఛిన్నాభిన్నం

  • వ్యవస్థలను నాశనం చేశారు

  • చెల్లింపులు చేయలేకే రిటైర్‌మెంట్‌ వయసు పెంచింది: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ‘చెల్లింపులు వాయిదా వేసి.. ఆర్థికభారం తప్పించుకునేందుకే రిటైర్‌మెంట్‌ వయసును మూడేళ్లకు పెంచారు.. దీనివల్ల మార్చి 2021 నుంచి 2024 మార్చి మధ్యలో పదవీ విరమణ చేయాల్సిన 17వేలమంది ఉద్యోగులు 2024 మార్చి తర్వాత రిటైర్‌ అయ్యారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు రూ.40 వేల కోట్ల వివిధ బిల్లులు పెండింగ్‌లో పెట్టి దిగిపోయింది. ఉద్యోగులు/పెన్షనర్లకు సంబంధించి వారసత్వ బకాయిల కింద రూ.4వేల కోట్లను ఇచ్చిందని’ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనసవరణ అంశంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అంతకుముందు మంత్రులకు మానవీయత లేదంటూ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సీఎంతో సహా మంత్రులందరిలోనూ మానవీయ కోణం ఉందన్నారు. ఉద్యోగుల బకాయిల భారం తమకు వారసత్వంగా వచ్చిందని, బీఆర్‌ఎస్‌ సక్రమంగా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదే కాదన్నారు. మూడు డీఏలను బకాయిలు పెట్టిపోయారని, ఇతర పెండింగ్‌ డీఏలను వీలైనంతమేర విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం జీతాల చెల్లింపులను ప్రతినెల 15వ తేదీ దాకా సాగదీసేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఒకటో తేదీనే జీతాలతో పాటు బకాయిల కింద రూ.700 కోట్లు ఇస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతినెల బిల్లుల బకాయిలకు రూ.1000 కోట్లు చెల్లించాలని విధాననిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత వైద్య పథకాన్ని తెస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తూ ఏదైనా ఘటన జరిగితే బీమా కింద రూ.1.20 కోట్లు ఉద్యోగులకు ఇస్తున్నామని ఇప్పటికే ఈ పథకాన్ని ఇంధనశాఖలో అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటిదాకా రూ.6146 కోట్ల పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేశామని వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రతి వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని.. తాము వాటిని ఆర్థిక క్రమశిక్షణతో సరిచేస్తున్నామన్నారు. కాగా.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఉద్యోగులకు 5 డీఏలు బకాయి ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బిల్లుల కోసం పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారంరటూ.. ఎందుకు చెల్లించడం లేదు నిధుల్లేకనా.. మనసులేకనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క స్పందిస్తూ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై త్వరలోనే విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. పెన్షనర్ల హెల్త్‌బిల్లులన్నీ క్లియర్‌ చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే ధరణి పోర్టల్‌ పేర పేదల భూములు లాక్కుందని, ఆభూ మోసాల నుంచి ప్రజలను బయట పడేసేందుకే తాము భూ భారతిని తెచ్చామని భట్టి పేర్కొన్నారు. అసైన్డ్‌ భూముల అంశంపై మాట్లాడుతూ హరీశ్‌రావు ఎస్సీల భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆక్రమించుకొంటోందని ఆరోపించారు. దీనిపై స్పందించిన భట్టి... ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన వారికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ధరణి నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు.

Updated Date - Mar 24 , 2026 | 05:54 AM