మేలు రకాల వరి సాగును ప్రోత్సహించాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:22 AM
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
ఎఫ్‌సీఐ బాయిల్డ్ రైస్ కొనడం లేదన్న వ్యవసాయ కమిషన్
హైదరాబద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న మేలు రకాల వరి సాగుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం కొనుగోళ్లు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగుపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బీపీటీ-5204, తెలంగాణ సోనా, కేఎన్‌ఎం-1638, జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ వంటి వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ రైతు కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు. ఆయా పంటల సాగు వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని భట్టి అన్నారు. కాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్లు తగ్గిస్తూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోందని క్యాబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ కమిషన్ వివరించింది.బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయడం లేదని తెలిపింది. మరోపక్క, ఖరీఫ్ సన్నద్ధతపై వరుస సమీక్షలు నిర్వహించిన మంత్రి తుమ్మల.. ‘కృషి వాస్’ ప్రాజెక్టుపైనా సమీక్ష జరిపారు. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పంటల్లో వచ్చే చీడపీడలను గుర్తించి, అవి పొలమంతా విస్తరించేలోపే రైతు మొబైల్‌కు ముందస్తు హెచ్చరికలు, వాడాల్సిన పురుగుమందుల సమాచారాన్ని కృషివాస్ వ్యవస్థ అందిస్తుందని వివరించారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కృషి వాస్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ వేదికపై నుంచే దమ్మపేట మండలం అంకంపాలేనికి చెందిన పెరుమళ్ల వీరభద్రరావుతో తుమ్మల ఫోన్‌లో మాట్లాడారు. కృషివాస్ వల్ల కలిగిన ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.