దోస్త్ లేదు.. దోచేస్తాం!
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:34 AM
ప్రతిభ ఆధారంగానే విద్యార్థులకు సీట్లు దక్కాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు కొన్ని కాలేజీలు తూట్లు పొడుస్తున్నాయి.
ఆన్‌లైన్ ప్రవేశాలకు దూరంగా 60 ప్రముఖ డిగ్రీ కళాశాలలు
ఇష్టారాజ్యంగా ఫీజులు.. కోర్టు తీర్పు సాకుతో ఏళ్లుగా దోపిడీ
ఉన్నత విద్యామండలి ఆదేశాలు పట్టని వైనం
కళాశాలలపై యూనివర్సిటీల పర్యవేక్షణా కరువు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రతిభ ఆధారంగానే విద్యార్థులకు సీట్లు దక్కాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు కొన్ని కాలేజీలు తూట్లు పొడుస్తున్నాయి. పదేళ్లుగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రవేశాల విధానాన్ని నీరుగారుస్తున్నాయి. కోర్టు ఆదేశాలున్నాయన్న సాకుతో కొన్నేళ్లుగా దోస్త్‌కు దూరంగా ఉంటున్నాయి. సొంతంగా ప్రవేశాలు చేపట్టకూడదని ఉన్నత విద్యామండలి అనేకమార్లు ఆదేశాలు జారీ చేసినా వినిపించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోనూ ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు దక్కాలని, రిజర్వేషన్ పాటించాలన్న లక్ష్యంతో 2015లో దోస్త్ విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ప్రారంభంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు దోస్త్ పరిధిలోనే ఉండగా.. ఆ తర్వాత కొన్ని కాలేజీలు దీని నుంచి బయటికి వచ్చాయి. దోస్త్ నిబంధనల ప్రకారం తాము ప్రవేశాలు చేపట్టలేమంటూ కోర్టును ఆశ్రయించి మినహాయింపు తెచ్చుకున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 డిగ్రీ కాలేజీలు దోస్త్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇందులో 43 ప్రైవేటు కాలేజీలు, 11 ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు, 3 ప్రైవేటు ఎయిడెడ్ అటానమస్ కాలేజీలు, 3 ప్రైవేటు అన్‌ఎయిడెడ్ అటానమస్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండగా.. వీటిలో మొత్తం 38,586 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లు దోస్త్ పరిధిలో లేకపోవడంతో ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ఆయా కాలేజీలే సొంతంగా అడ్మిషన్లు చేపడుతుండంతో...ప్రభుత్వ నిబంధనలేవీ అమలు కావడం లేదు. దీనిని దోస్త్ పరిధిలో ఉన్న కాలేజీలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.
దోస్త్‌లో సగం సీట్లు ఖాళీ..
రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ పరిధిలో 830 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఉండగా.. వీటిలో 3,77,907 సీట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఏటా సగం సీట్లు భర్తీ కావడమూ గగనమవుతోంది. 2025-26లో 1,76,170 (46.61శాతం)సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరోవైపు దోస్త్ పరిధిలో లేని కాలేజీల్లో సీట్లన్నీ వేగంగా భర్తీ అవుతున్నాయి. అవన్నీ ప్రముఖ కాలేజీలు కావడంతో.. వాటిలో చేరేందుకే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దోస్త్‌లో లేకపోవడంతో ఉన్నత విద్యామండలితోపాటు సంబంధిత వర్సిటీల పర్యవేక్షణ సైతం ఆ కాలేజీలపై ఉండడం లేదు. దీంతో ఫీజుల వసూళ్ల నుంచి పాఠాల బోధన వరకు ఆ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దోస్త్‌లో ఉన్నా లేకపోయినా ఆయా కాలేజీలు వర్సిటీ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉండగా.. రెట్టింపు స్థాయిలో తీసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా.. సంబంధిత వర్సిటీలు గానీ, ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. యూనివర్సిటీల్లోని కొందరు అధికారులు దోస్త్‌లో లేని కాలేజీలకు మద్దతు పలుకుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. అన్ని కాలేజీలను దోస్త్ పరిధిలోకి తేవాలని, అధిక ఫీజులను నియంత్రించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.