Share News

తెలంగాణ.. మావోయిస్టు రహితం: డీజీపీ

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:08 AM

తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని.. డీజీపీ శివధర్‌ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ పీఎల్‌జీఏ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలకు చెందిన 42...

తెలంగాణ.. మావోయిస్టు రహితం: డీజీపీ

  • ఆయన సమక్షంలో 42మంది మావోయిస్టుల లొంగుబాటు

  • భారీగా ఆయుధాలు, 800 గ్రాముల బంగారం అప్పగింత

  • వారికి రూ.1.93 కోట్ల రివార్డు.. త్వరలోనే హెల్త్‌కార్డులు: డీజీపీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని.. డీజీపీ శివధర్‌ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ పీఎల్‌జీఏ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలకు చెందిన 42 మంది మావోయిస్టులు డీజీపీ సమక్షంలో శుక్రవారం జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ జీరో అయ్యిందని, పీఎల్‌జీఏ కనుమరుగైందన్నారు. తెలంగాణకు చెందిన ఐదుగురు మావోయిస్టులు ఇంకా పార్టీలో మిగిలి ఉన్నారని తెలిపారు. ఆ ఐదుగురూ.. మావోయిస్టు అగ్రనేత గణపతి, ఆయన భార్య జోడే రత్నాభాయి, ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న వార్త శేఖర్‌, ఆయన భార్య రంగబోయిన భాగ్య, పసునూరి నరహరి అని వెల్లడించారు. సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపుమేరకు జనజీవన స్రవంతిలోకి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వనిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. గణపతి బతికే ఉన్నారుగానీ.. ఆయన అడవిలో మాత్రంలేరని తెలిపారు. ఆయన ఎక్కడ ఉన్నారో లొంగిపోయిన మావోయిస్టులకూ సమాచారం లేదని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు సర్కారు ప్రకటించిన మేరకు.. త్వరలో హెల్త్‌కార్డులను త్వరలో అందించనున్నామని, దీనికి సంబంధించిన జీవో 1-2 రోజుల్లో విడుదల అవుతుందని చెప్పారు. శుక్రవారం లొంగిపోయిన మావోయిస్టుల్లో పీఎల్‌జీఏ ప్రస్తుత బెటాలియన్‌ ఇన్‌చార్జ్‌, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడైన సోడిమల్ల అలియాస్‌ కేషాల్‌తో పాటు పీఎల్‌జీఏకు చెందిన 21 మంది, తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన 11 మంది, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెం దిన 10 మంది ఉన్నారు. 36 ఆయుధాలు, 44 మ్యాగజైన్లు, రెండు హ్యాండ్‌ గ్రనేడ్లు, 1007తూటాలతో పాటు బిస్కెట్ల రూపంలో 800 గ్రాముల బంగారాన్ని వీరు పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ.1.93 కోట్ల రివార్డును డీజీపీ అందించారు. వారు స్వాధీనం చేసిన ఆయుధాలన్నీ కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలకు సంబంధించినవేనని.. అడవుల్లో అమర్చిన మందుపాతరలను గుర్తించి, నిర్వీర్యం చేయడానికి లొంగిపోయిన మావోయిస్టుల సహకారం తీసుకుంటామన్నారు. 2024 నుంచి నేటి వరకు మొత్తం 761 మంది తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారని డీజీపీ వివరించారు. వీరందరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌, గ్రేహౌండ్స్‌, జిల్లా పోలీసుల కృషి వల్ల ఈ విజయం సాధ్యమయ్యిందన్నారు. కాగా.. శుక్రవారం జనజీవన స్రవంతిలో కలిసిన 42 మంది మావోయిస్టుల్లో 41 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు కాగా.. ములుగు జిల్లాకు చెందిన మహేందర్‌ ఒక్కరే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.

సంబంధం లేదు..

దేశ భద్రతకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ నమోదు చేస్తున్న కేసులు విచారణలతో తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధమూ లేదని డీజీపీ స్పష్టం చేశారు. ఉపా చట్టం కింద నమోదైన కేసులో తెలంగాణలోని పలువురు ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు, రాజకీయ నేతలకు ఎన్‌ఐఏ నోటీసుల జారీపై ప్రశ్నించగా.. అది కేంద్రం పరిధిలోని అంశమని చెప్పారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాము సరెండర్‌ కాలేదని, అరెస్టు అయ్యామని చెప్పడంపై విలేకరులు ప్రశ్నించగా.. వారు లొంగిపోయారని తామెన్నడూ చెప్పలేదని, జనజీవన స్రవంతిలోకి వచ్చారని మాత్రమే చెప్పామన్నారు. అయినా.. అరెస్టు అయితే జైల్లో ఉండాలని, కానీ బయట తిరుగుతున్నారంటేనే అర్థం చేసుకోవాలన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 05:08 AM