Share News

ఆలూరులో డేటా సెంటర్‌ సిటీ

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:04 AM

తెలంగాణను డేటా సెంటర్లకు హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ‘డేటా సెంటర్‌ సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఆలూరులో డేటా సెంటర్‌ సిటీ

  • 1500 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు రూపకల్పన

  • తెలంగాణను డేటా సెంటర్‌ హబ్‌గా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు

  • 11 గిగావాట్లకు పైగా డేటా సామర్థ్యం టార్గెట్‌

  • డేటా సెంటర్ల అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీరు

హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణను డేటా సెంటర్లకు హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ‘డేటా సెంటర్‌ సిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌కు 55 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామంలో సుమారు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డేటా సెంటర్‌ సిటీలో ప్రత్యేకంగా మౌలిక వసతులు, ఫైబర్‌ కనెక్టవిటీ, హైసెక్యూరిటీ జోన్లు ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తూ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ డేటా సెంటర్‌ సిటీ కోసం నీరు, విద్యుత్‌, రవాణా, డిజిటల్‌ కనెక్టివిటీ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు.. డేటా సెంటర్‌ సిటీ కోసం భూమిని గుర్తించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రాజెక్టుకు ఇప్పటికే పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌తోపాటు కంట్రోల్‌ ఎస్‌, సైఫై, ఎస్‌టీటీ గ్లోబల్‌ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో ఇప్పటికే డేటా సెంటర్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 150 నుంచి 200 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు పని చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సామర్థ్యం సుమారు 5 గిగావాట్లకు పెరిగే అవకాశముంది. ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాల ప్రకారం మొత్తం ప్రతిపాదిత డేటా సెంటర్ల సామర్థ్యం 11 గిగావాట్లకు పైగా ఉండనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.


డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగు నీరు

డేటా సెంటర్లు పని చేయడానికి భారీగా నీళ్లు అవసరం అవుతాయి. దీంతో నీటి లభ్యత అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగు నీటిని శుద్ధి చేసి ఆ నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే చందనవెల్లి, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రాంతాల్లో పారిశ్రామిక అవసరాలకు శుద్థి చేసిన మురుగు నీటిని వినియోగించేందుకు సర్క్యులర్‌ ఎకానమీ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేయనుంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ నీటి సరఫరా సంస్థ ప్రస్తుతం 41 శుద్ధి కేంద్రాల ద్వారా రోజుకు 1750 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేస్తోంది. ఇందులో సుమారు 530 మిలియన్‌ లీటర్ల నీటిని పారిశ్రామిక అవసరాలకు మళ్లించనున్నారు. డేటా సెంటర్లకు కూడా ఈ నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక, డేటా సెంటర్లకు విద్యుత్‌ కూడా భారీగా అవసరం. దీంతో డేటా సెంటర్‌ సంస్థలు ఓపెన్‌ యాక్సెస్‌ ద్వారా అంటే డిస్కమ్‌ల నుంచి కాకుండా ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. చందనవెల్లి, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఫ్యాబ్‌ సిటీ ప్రాంతాలు ఇప్పటికే ప్రధాన క్లస్టర్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. డేటా సెంటర్‌ సిటీ ఏర్పాటు, సర్క్యులర్‌ ఎకానమీ ప్రాజెక్టు అమలు ద్వారా డిజిటల్‌ అభివృద్థి, పర్యావరణ సమతుల్యతను సమన్వయం చేస్తూ తెలంగాణను దేశానికి మార్గదర్శకంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - Jun 26 , 2026 | 05:04 AM