డీజే ఉన్నా.. డప్పు దరువే
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:53 AM
ఆధునిక మ్యూజిక్‌కే పరిమితమనుకునే పబ్‌లు, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోని ఈవెంట్లలో ఇప్పుడు ఫోక్ బీట్‌కు పట్టం కడుతున్నారు. ఇటీవల వైరల్‌గా మారిన ‘వీకెండ్ మ్యూజిక్ ఈవెనింగ్స్’ కార్యక్రమాల్లోనూ..
జాతరలు, బోనాలు, పెళ్లిళ్లలో.. పబ్బులు, పార్టీలు, ఈవెంట్లలో నాటు డప్పుదే పైచేయి
పలు కార్పొరేట్ హోటల్స్‌లో స్పెషల్‌గా డప్పు ప్రదర్శన
మిస్ వరల్డ్ పోటీల్లోనూ ప్రత్యేక ఆకర్షణ
సినిమాలు, పాటల్లో ఒక బీట్ అయినా ఉండాల్సిందే
విదేశీయులనూ దరువు వేయిస్తున్న డప్పు బృందాలు
కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆదరణ.. కళాకారులకు ఉపాధి
టెక్నాలజీ మారింది. సంగీతం రూపు మార్చుకుంది. భారీ సౌండ్ సిస్టమ్స్.. ఎలక్ట్రానిక్ బీట్స్ వచ్చాయి. రీమిక్స్‌లతో డీజేలు మోతమోగిస్తున్నాయి. అయినా నాటు డప్పు దరువు మాత్రం పడాల్సిందే. అది వినగానే కాళ్లు కదలాల్సిందే. ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరలు, బోనాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయంగా మాత్రమే డప్పులను చూసేవారు. కానీ ఇప్పుడు గల్లీల నుంచి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల వరకు కూడా డప్పు మోత మోగిస్తోంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఆధునిక మ్యూజిక్‌కే పరిమితమనుకునే పబ్‌లు, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోని ఈవెంట్లలో ఇప్పుడు ఫోక్ బీట్‌కు పట్టం కడుతున్నారు. ఇటీవల వైరల్‌గా మారిన ‘వీకెండ్ మ్యూజిక్ ఈవెనింగ్స్’ కార్యక్రమాల్లోనూ డప్పు సౌండ్ పడుతోంది. మాస్ లిరిక్స్‌కు, డప్పు దరువు కలిస్తే కార్యక్రమంలో ఉన్నవాళ్లంతా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేస్తున్నారు. పెళ్లిళ్లు, బరాత్‌లు, రిసెప్షన్స్‌లో సరేసరి. డప్పు కొట్టేవారు అందుబాటులో లేకుంటే యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్‌లో అందుబాటులో ఉన్న డప్పు దరువులు, పాటలను పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన ‘మిస్ వరల్డ్’ పోటీల ప్రారంభోత్సవంలోనూ డప్పు మోగింది. 25 మంది మహిళలతో కూడిన డప్పు బృందం ఇచ్చిన వైవిధ్యభరిత ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీల కార్యక్రమాల్లో, ఐటీ కారిడార్‌లో ఉన్న ఫైవ్‌స్టార్ హోటళ్లకు అంతర్జాతీయ డెలిగేట్స్, ప్రత్యేక అతిథులు వచ్చిన సమయంలోనూ ప్రత్యేకంగా డప్పు బృందాలతో ప్రదర్శన నిర్వహిస్తుంటారు. ఇటీవల సినిమాల్లోనూ డప్పు మోత ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమా పాటల్లోనూ డప్పుతో కొట్టించే నాటు మ్యూజిక్‌ను పెడుతున్నారు.
సరిహద్దులు దాటిన మన డప్పు..
పల్లె నుంచి వచ్చిన డప్పు దేశ సరిహద్దులు దాటి దరువు వేస్తోంది. విదేశాల్లో ఉంటోన్న తెలుగు కుటుంబాలు నిర్వహించుకునే పలు కార్యక్రమాలు, ప్రత్యేకించి తానా, ఆటా లాంటి అసోసియేషన్‌లు ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో డప్పు క్రేజ్ ఉంటోంది. దానితో డప్పు కళాకారులను ప్రత్యేకంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. మలేషియా, అబుధాబి, న్యూజిలాండ్, దుబాయ్, అమెరికా తదితర దేశాల్లోనూ ఒక ఊపు ఊపింది. పలు దేశాల కల్చరల్ ఎక్స్ఛేంజీ కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ డప్పు కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ వెళ్లిన సమయంలో అక్కడున్న ‘మౌరీ’ తెగలతో మన రాష్ట్ర బృందం చర్చించింది. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరలో మౌరీ తెగవాళ్లు వారి సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చారు.
పెరుగుతున్న ఉపాధి.. సోషల్ మీడియా ఆదరణ
ఎల్లమ్మ, పోచమ్మ సహా గ్రామదేవతల దరువుతోపాటు చాటింపు శబ్ధాలు గ్రామాల్లో ఎక్కువగా వినబడుతుంటాయి. పులిఅడుగు (టైగర్ బీట్స్), దో-మార్, తీన్‌మార్ దరువుకు క్రేజ్ ఎక్కువ. ఇక ‘జులుస్ దెబ్బ’ అనే దరువు ర్యాలీలు, ప్రదర్శనల్లో ఉంటుంది. డప్పుపై పెరుగుతున్న ఆసక్తితో.. ఆ రంగంలో ఉన్న కళాకారులకు ఉపాధి పెరుగుతోంది. స్థానికంగానే కాకుండా విదేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు. డప్పు ప్రదర్శనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
యువత.. డప్పు దరువుకు పట్టంకడుతోంది
ప్రస్తుతం డప్పు దరువుకు ఆదరణ పెరుగుతోంది. డప్పులో సుమారు 101 రకాల దరువులున్నాయి. దేనికదే ప్రత్యేకం. యువత డప్పు దరువుకు పట్టం కడుతోంది. ఒక్కోసారి మాకు ఖాళీ ఉండడంలేదు. ప్రస్తుతం మా దగ్గర 3,464 మంది డప్పు శిక్షణ తీసుకున్నారు. వీరిలో 1,500 మంది వరకు మహిళలే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లోనూ ఇప్పుడు డప్పు బృందాలు ఉంటున్నాయి. ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం ఉండాలి. 2024లో కేంద్రం ప్రకటించిన సాహిత్య అవార్డుల్లో డప్పు విభాగంలో నాకు ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ వచ్చింది. నేను, నా బృందం మలేసియా, దుబాయ్, అబుధాబి, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లొచ్చాం. అక్టోబరులో ఆస్ట్రేలియాలో నిర్వహించే కల్చరల్ ఎక్ఛ్సేంజీ ప్రోగ్రామ్‌కు వెళ్తున్నాం.
- డప్పు భాస్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ అవార్డు గ్రహీత
డప్పుకు క్రేజ్ పెరుగుతోంది..
ఎన్ని బీట్‌లు ఉన్నా డప్పు దరువుకు క్రేజ్ ఎక్కువ. అది మరింతగా పెరుగుతోంది. ఇటీవల మా బృందం అమెరికా పర్యటనలో వేసిన డప్పు దరువులకు అక్కడున్నవారంతా ఊగిపోయారు. ఒక్కొక్కరు లేచి చిందేశారు. డప్పు శబ్దం వినపడగానే తెలుగుతనం, మనది అనే భావన ఏర్పడుతుంది. అందుకే మనవాళ్లు ఎక్కడున్నా డప్పు దరువు వినగానే కాళ్లు కదుపుతారు.
- రామ్ మిర్యాల, గాయకుడు