Share News

కరువుభత్యంలో అట్టడుగున తెలంగాణ

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:35 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం (డీఏ) చెల్లింపు విషయంలో దేశంలో తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ అట్టడుగున ఉన్నాయి.

కరువుభత్యంలో అట్టడుగున తెలంగాణ

  • దేశంలో అత్యధికంగా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నది తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లోనే!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం (డీఏ) చెల్లింపు విషయంలో దేశంలో తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ అట్టడుగున ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాల్లో ఒక డీఏ మాత్రమే పెండింగ్‌లో ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 61 శాతం డీఏ చెల్లిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కేవలం 33.67 శాతమే చెల్లిస్తోంది. దేశంలో అత్యధిక రాష్ట్రాలు 58 శాతం చెల్లిస్తున్నాయి. డీఏ అనేది ఉద్యోగుల జీవనవ్యయాన్ని సమతుల్యం చేస్తుంది. తెలంగాణలో 5 డీఏలు పెండింగ్‌లో ఉండటంతో తమ ఆదాయం, కొనుగోలు శక్తి తగ్గిందని ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై తరచూ ఉద్యోగ సంఘాలు నిరసనలకు దిగుతుండగా.. ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగానూ ఉపయోగపడుతోంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంక్షేమ పథకాల భారం వంటి అంశాలు డీఏ విడుదలలో జాప్యానికి కారణమవుతున్నాయనే వాదన ఉంది. కాగా, గుజరాత్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిసా, అసోం, తమిళనాడు, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఒక డీఏ పెండింగ్‌లో ఉండగా 58 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. మణిపూర్‌, త్రిపురలో ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. ఆ రెండు రాష్ట్రాల్లో 42 శాతం చొప్పున చెల్లిస్తున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 04:35 AM