సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ భేష్
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:03 AM
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ చేపట్టిన చర్యలకు ప్రధాని కార్యాలయం నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రశంసలు లభించాయి.
నగదు రికవరీ సహా 9 అంశాల్లో దేశంలోనే ప్రథమ స్థానం
సమన్వయ పోర్టల్ అభ్యర్థనల్లో 96 శాతం పరిష్కారం
‘ప్రగతి’ సమీక్షలో రాష్ట్రానికి కేంద్రం ప్రశంసలు
హైదరాబాద్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ చేపట్టిన చర్యలకు ప్రధాని కార్యాలయం నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో ప్రశంసలు లభించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని భారత సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో తెలంగాణ తన పనితీరుతో దేశంలోనే ముందంజలో ఉన్నట్లు సమావేశంలో ప్రస్తావించారు. 9 అంశాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనుసరిస్తున్న విధానాలు దేశంలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఐ4సీతో సమన్వయం, ఈ జీరో ఎఫ్‌ఐఆర్ అమలులో పురోగతి, ఫిర్యాదుల పరిష్కారం, నగదు రికవరీకి చర్యలు, చట్టవిరుద్ధ కంటెంట్‌ను తొలగించే సహయోగ్ పోర్టల్, సైబర్ నేరాలను అరికట్టేందుకు దోహదపడే సమన్వయ పోర్టల్ సమర్థ వినియోగం, సైబర్ క్రైం హాట్‌స్పాట్ల గుర్తింపు, చట్టం అమలులో వివిధ సంస్థలకు శిక్షణ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరును కేంద్రం అభినందించింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు 8712665600 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం వేగవంతమవుతుండగా, బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి వారికి అందించే ప్రక్రియ సమర్థవంతంగా సాగుతోందని అధికారులు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మరోవైపు, సైబర్ నేరాలతో సంబంధం ఉందన్న పేరుతో దేశంలో చాలామంది వినియోగదారుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. తమకు తెలియకుండా తమ ఖాతాల్లోకి ఎవరి ద్వారా స్వల్ప మొత్తం వచ్చినా దాన్ని నేరంగా చూడటం వల్ల వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని పరిష్కరించడానికి కేంద్ర హోం శాఖ ‘గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం (జీఆర్‌ఎం)’ ప్రారంభించింది. తెలంగాణకు సంబంధించి 2,368మంది ఖాతాల పునరుద్ధరణకు వినతులు రాగా... వాటిలో 2,086 ఖాతాలను (88 శాతం) పునరుద్ధరించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ తెలిపారు. సైబర్ నేరాల బాధితులకు రూ.50 వేల వరకు ఎఫ్‌ఐఆర్, కోర్టు ఉత్తర్వులు లేకుండానే తిరిగి చెల్లించే సులభతరమైన ‘మనీ రిస్టోరేషన్ మాడ్యుల్’ను కేంద్రం ప్రారంభించింది. దీన్ని తెలంగాణలో సమర్థంగా అమలు చేయడం ద్వారా ఈ నెల 2 వరకు 34,524 కేసుల్లో రూ.16.42 కోట్లు ఇప్పించగలిగామని శిఖా గోయల్ వివరించారు. సహయోగ్ పోర్టల్ ద్వారా కంటెంట్ బ్లాకింగ్, తొలగింపు, డేటా వెల్లడి, ఐడీల కోసం చట్టబద్ధ సంస్థల నుంచి 1,529 అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. యూఆర్‌ఎల్‌ల తొలగింపు అభ్యర్థనలు 22,447 వచ్చాయని, 20,070 యూఆర్‌ఎల్‌లను (89.41శాతం) తొలగించామని తెలిపారు. అంతరాష్ట్ర సైబర్ నేరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి సమన్వయ పోర్టల్ ద్వారా 6,721అభ్యర్థనలు వచ్చాయని, వాటిలో 6,518 అభ్యర్థనలను పరిష్కరించామని.. అంటే 96.68 శాతం విజయం సాధించామన్నారు. సమన్వయ పోర్టల్ ద్వారా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు 7,018 అభ్యర్థనలు పంపామని, వాటిలో 79.22 శాతం అంటే 5,560 మాత్రమే పరిష్కారం అయ్యాయని తెలిపారు. నిందితుల ప్రొఫైలింగ్‌కు సంబంధించి 3,524 కేసుల్లో 5,493 మంది అరెస్టైన నిందితుల ప్రొఫైల్స్ అప్‌లోడ్ చేశామని వివరించారు. రాష్ట్ర, కేంద్ర సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి బాధితులకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని శిఖా గోయల్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ అభినందన
సైబర్ నేరాల నియంత్రణలో దేశంలో ప్రథమ స్థానం సాధించినందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సీఎం రేవంత్ అభినందించారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, ప్రజలే కేంద్రంగా పరిపాలనలో ప్రభుత్వ అంకితభావానికి ఈ విజయం నిదర్శనమన్నారు.