Share News

మ్యూల్‌ ఖాతాల ఏజెంట్‌ అరెస్టు

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:28 AM

రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేరళ, కర్ణాటకలో ఆపరేషన్‌ చేపట్టి సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఓ ఏజెంట్‌ను, తమ ఖాతాలు ఇచ్చిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

మ్యూల్‌ ఖాతాల ఏజెంట్‌ అరెస్టు

  • సైబర్‌ నేరగాళ్లకు ఖాతాలిచ్చిన మరో ఐదుగురి పట్టివేత

  • కేరళ, కర్ణాటకలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌

హైదరాబాద్‌, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేరళ, కర్ణాటకలో ఆపరేషన్‌ చేపట్టి సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఓ ఏజెంట్‌ను, తమ ఖాతాలు ఇచ్చిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశాల్లో ఉన్న ఈ సైబర్‌ నేరగాళ్లు కొంతకాలం కిందట డిజిటల్‌ అరెస్టు, ట్రేడింగ్‌ పేరుతో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాధితుల నుంచి రూ.16.20 కోట్లు కొల్లగొట్టారు. ఆ సొమ్మును బదిలీ చేసుకోవడానికి ఉపయోగించేవే ఈ మ్యూల్‌ ఖాతాలు. డబ్బు ఆశ చూపి బయటి వ్యక్తులతో ఈ ఖాతాలను తెరిపిస్తారు. లేదా అప్పటికే వారికి ఉన్న ఖాతాలను వాడుకుంటారు. ఈ సొమ్ము మ్యూల్‌ ఖాతాలకు వెళ్లి, ఆపై క్రిప్టో కరెన్సీగా మారి విదేశాలకు చేరిందని అధికారులు గుర్తించారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ ఈ వివరాలు తెలిపారు. కేరళకు చెందిన రెంజు పతక్కు రెజి తన బ్యాంకు ఖాతా వివరాలను విదేశాల్లో ఉన్న సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చాడు. డిజిటల్‌ అరెస్టు ద్వారా వచ్చిన డబ్బును ఆ ఖాతాకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కేరళకు చెందిన అరుణ్‌ శ్రీనివాస్‌, వీ మీనన్‌లు గువాహటి, జైపూర్‌కు చెందిన ఏజెంట్ల ద్వారా కమిషన్‌ పద్ధతిలో మ్యూల్‌ ఖాతాలు ఇచ్చారు. బెంగళూరులోని జిప్‌ క్లీనింగ్‌ సర్వీసెస్‌ డైరెక్టర్లు జయప్రకాష్‌, బాలరాజు, బియ్యం వ్యాపారి హరీశ్‌ తమ ఖాతాలను పూనేలోని ఏజెంట్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అధికారులు ఆ ఏజెంట్లను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. సైబర్‌ నేరగాళ్లు విదేశాల్లో ఉన్నందున కేంద్ర సంస్థలతో మాట్లాడుతున్నామని షికా గోయల్‌ తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 03:28 AM