Share News

సైబర్‌ నేరాలే అతిపెద్ద సవాల్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:02 AM

దేశంలో సైబర్‌ నేరాలే అతిపెద్ద సమస్యగా మారాయని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. ఈ నేరాల కట్టడికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని తెలిపారు.

సైబర్‌ నేరాలే అతిపెద్ద సవాల్‌

  • దేశం మొత్తం సైబర్‌ నేరాల్లో తెలంగాణలోనే 44 శాతం: డీజీపీ

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో సైబర్‌ నేరాలే అతిపెద్ద సమస్యగా మారాయని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. ఈ నేరాల కట్టడికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని తెలిపారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో 44 శాతం తెలంగాణలోనే ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు డీజీపీకి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సైబర్‌ నేరాలపై దేశవ్యాప్తంగా గత ఏడాది 49,620 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, తెలంగాణలోనే 21,639 నమోదయ్యాయని చెప్పారు. 2025లో రాష్ట్రంలో సైబర్‌ నేరాల వల్ల రూ.1,524 కోట్ల నష్టం నమోదైనప్పటికీ, 2024తో పోలిేస్త 20 శాతం తగ్గిందని తెలిపారు. సైబర్‌ ఫిర్యాదులు 91,369 వచ్చాయని వెల్లడించారు. నేరస్తుల ఖాతాల్లోని రూ.279 కోట్లు ఫ్రీజ్‌ చేశామని వివరించారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాల కట్టడికి డీజీపీ పలు సూచనలు చేశారు. కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత, డేటా అనలిటిక్స్‌ వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్‌ ల్యాబ్‌, సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌, సెంట్రల్‌ మానిటరింగ్‌ యూనిట్‌, సోషల్‌ మీడియా యూనిట్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ తదితర విభాగాలను సందర్శించి, వాటి పనితీరును పరిశీలించారు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌తో పాటు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ ఏఐ ఆధారిత సైబర్‌ కాల్‌ సెంటర్‌ పనితీరును పరిశీలించారు. ‘నేను సైబర్‌ మోసంలో డబ్బులు కోల్పోయాను’ అని బాధితురాలు చెప్పగానే ఏఐ వ్యవస్థ వెంటనే ఆమెకు ధైర్యం చెబుతూ పేరు, ప్రాంతం, సమీప పోలీస్‌ స్టేషన్‌, ఘటన వివరాలను సకరించింది. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు ఆటోమెటిక్‌గా సమాచారం చేరే విధానాన్ని డీజీపీ పరిశీలించి అభినందించారు.

Updated Date - Jul 17 , 2026 | 06:03 AM