2.30 లక్షల కేసులు.. రూ.4,048 కోట్లు
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:28 AM
ఆశ మనిషికి సహజం. అయితే, అత్యాశకు పోతే మొత్తం పోతుందనే సామెతను నిజం చేస్తూ సైబర్ నేరగాళ్లు అత్యాశపరులను నిలువునా దోచేస్తున్నారు.
రెండున్నరేళ్లలో రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాల లెక్క
ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ మోసాల కేసులే అధికం
హైదరాబాద్, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): ఆశ మనిషికి సహజం. అయితే, అత్యాశకు పోతే మొత్తం పోతుందనే సామెతను నిజం చేస్తూ సైబర్ నేరగాళ్లు అత్యాశపరులను నిలువునా దోచేస్తున్నారు. తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు 60 శాతం మేర ఉండడమే ఇందుకు నిదర్శనం. అధిక వడ్డీలు, అధిక లాభాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి ఈజీ మనీకి ఆశపడి చాలామంది పెట్టుబడులు పెడుతూ చివరికి సైబర్ నేర బాధితులుగా మిగులుతున్నారు. ఇలా మోసపోతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉన్నవారు, రిటైరైనా సంపాదనకు మార్గాలు వెతుకుతున్న వృద్ధులు అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి ఎరవేస్తున్న సైబర్ నేరగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. 2024 నుంచి ఈ ఏడాది జూన్ వరకు సైబర్ నేరాలకు సంబంధించి రాష్ట్రంలో 2.30లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో బాధితులు పొగొట్టుకున్న సొమ్ము రూ.4,048కోట్లు. ఈ గణాంకాలు సైబర్ నేరగాళ్లకు తెలంగాణ హట్‌స్పాట్‌గా మారుతుందనే విషయాన్ని సూచిస్తున్నాయి. చిన్న మొత్తాలతోపాటు ఒకే ముఠా బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న కేసులు నిత్యం రాష్ట్రంలో నమోదవుతున్నాయి. కాగా, సైబర్ మోసానికి గురైతే బాధితులు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. దోచుకున్న డబ్బు వివిధ ఖాతాలకు బదిలీ అయ్యేలోపు ఫిర్యాదు చేస్తే బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ఆ డబ్బును ఆపవచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గత రెండున్నరేళ్లలో సైబర్ నేరాలకు సంబంధించి 55,83,574 ఫిర్యాదులు నమోదు కాగా సైబర్ నేరగాళ్లు రూ.54,345కోట్లు దోచుకున్నారు.